లక్ష్మీకాంతమ్మ సస్పెన్షన్‌కు రంగం సిద్ధం

- - Sakshi

అనంతపురం క్రైం: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని గైనిక్‌ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ లక్ష్మీకాంతమ్మ సస్పెన్షన్‌కు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఆమె సస్పెన్షన్‌కు కలెక్టర్‌ గౌతమి సిఫారసు చేశారు. ఇటీవల ధర్మవరం మండలం చిగిచెర్ల గ్రామానికి చెందిన గర్భిణి కవిత(25)కు అబార్షన్‌ చేసి, మృతికి కారణమైందన్న ఆరోపణల్లో వెల్లువెత్తిన నేపథ్యంలో దీనిపై ‘అనంతలో దారుణం, చిదిమేస్తున్నారు, కదిలిన వైద్యురాలి అక్రమాల డొంక, అన్నీ అబాద్దాలే’ తదితర శీర్షికలతో ‘సాక్షి’లో వరుస కథనాలు వెలువడ్డాయి. దీనిపై స్పందించిన కలెక్టర్‌ సమగ్ర విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వీరబ్బాయి, పీసీపీఎన్‌డీటీ యాక్ట్‌ జిల్లా నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ యుగంధర్‌, డెమో బృందం ఇటీవల అమ్మవారిపల్లి, చిగిచెర్ల గ్రామాలను సందర్శించి మృతురాలి కుటుంబీకులతో స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. అంతేకాక ఘటనకు సంబంధించి డాక్టర్‌ లక్ష్మీకాంతమ్మ, రూత్‌ ఆస్పత్రిపై అనంతపురం త్రీటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

99 మందికి అబార్షన్లు:
వైద్యాధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతుల్లేకుండానే అనంతపురంలోని శ్రీనివాసనగర్‌లో రూత్‌ ఆస్పత్రిని డాక్టర్‌ లక్ష్మీకాంతమ్మ నిర్వహిస్తోందని గుర్తించారు. అంతేకాక మెడికల్‌ టర్నినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ(అబార్షన్‌) చేయడానికి అనుమతులు లేకున్నా 2022 నుంచి ఇప్పటి వరకూ ఏకంగా 99 అబార్షన్లు చేసినట్లు (అభిజ్ఞ ఆస్పత్రిలో) బహిర్గతం కావడంతో విచారణాధికారులు విస్తుపోయారు. ఈ నేపథ్యంలో రూపొందించిన తుది నివేదికను సోమవారం కలెక్టర్‌కు సమర్పించారు.

పరిశీలించిన కలెక్టర్‌ గౌతమి.. వెంటనే డాక్టర్‌ లక్ష్మీకాంతమ్మను సస్పెన్షన్‌కు సిఫారసు చేశారు. అయితే డాక్టర్‌ లక్ష్మీకాంతమ్మ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ) పరిధిలో ఉండడంతో కలెక్టర్‌ చేసిన సిఫారసుతో పాటు విచారణ నివేదికను వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శ్రీదేవి ద్వారా డీఎంఈకి చేర్చేలా డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వీరబ్బాయి చర్యలు తీసుకున్నారు.

చట్టపరమైన చర్యలకు ఆదేశిస్తాం
ఎంటీపీ అనుమతులు తీసుకోకుండా అబార్షన్లు చేసిన డాక్టర్‌ లక్ష్మీకాంతమ్మపై విచారణ కొనసాగుతుంది. నిబంధనలకు విరుద్ధంగా అధిక సంఖ్యలో అబార్షన్లు చేశారు. ఎంటీపీ చట్టాన్ని అతిక్రమించిన డాక్టర్‌ లక్ష్మీకాంతమ్మపై చట్టపరమైన చర్యలకు ఆదేశిస్తాం.

– డాక్టర్‌ యుగంధర్‌,పీసీపీఎన్‌డీటీ యాక్ట్‌ జిల్లా నోడల్‌ ఆఫీసర్‌

Read latest Ananthapur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top