కల్తీ రాజకీయంపై కన్నెర్ర
అనంతపురం: అత్యంత పరమ పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యి వాడారంటూ కూటమి నేతలు దుష్ప్రచారం చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ హిందువుల మనోభావాలతో ఆటలాడారు. అయితే సీబీఐ సిట్ విచారణలో జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యి వాడలేదంటూ తేలింది. తిరుమల క్షేత్రానికి కళంకం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఈ మహాపచారానికి పాప ప్రక్షాళన కోసం శనివారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ శ్రీవేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతపురంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయం వద్ద వేంకటేశ్వరస్వామి చిత్రపటం వద్ద పూజలు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు ప్రభుత్వం చేసిన అసత్య ప్రచారాలను వైఎస్సార్‌సీపీ నాయకులు ఖండించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా చేసిన కుట్రలు సీబీఐ సిట్ నివేదికతో పటాపంచలయ్యాయని, ఇకనైనా ఇలాంటి ప్రచారాలకు స్వస్తి పలకాలని హితవు పలికారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేవాలయాల పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. భక్తుల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని తెలిపారు. పూజా కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు మహాలక్ష్మి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్, టీటీడీ మాజీ సభ్యులు అశ్వత్థనాయక్, పార్టీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి, మేయర్ వసీం సలీం, డిప్యూటీ మేయర్లు దాసరి వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, ప్రియాంక, కృష్ణవేణి, భారతి, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, కొర్రపాడు హుస్సేన్ పీరా, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్‌ఘర్ రిజ్వాన్, జానీ, అంజి, కట్టుబడి తానీషా, పసలూరు ఓబులేసు, శేఖర్ బాబు, రిలాక్స్ నాగరాజు, రామచంద్ర, రాధాకృష్ణ, శోభాబాయి, అంజలి, హజరాబీ, ఉషా, మహేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.
ప్రజలే గుణపాఠం చెప్తారు
ఆపదమొక్కులవాడు, అనాథ రక్షకుడైన వేంకటరమణస్వామికి మలినం అంటించాలని చూస్తే భక్తులెవ్వరూ సహించబోరని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి హెచ్చరించారు. రాప్తాడులోని పండమేరు వేంకటరమణస్వామి ఆలయంలో నిర్వహించిన పాప పరిహార ప్రత్యేక పూజల అనంతరం ఆయన మాట్లాడారు. కలియుగంలో ఎప్పటి పాపం అప్పుడే పండుతుందని, రాష్ట్రంలోని పాలకులకు అతిత్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వీరిని కూటమి నుంచి బహిష్కరించాలని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశామన్నారు.
మంచిబుద్ధి ప్రసాదించు స్వామీ
శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ అయ్యిందంటూ తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు – పవన్ కల్యాణ్‌కు మంచి బుద్ధి ప్రసాదించాలని తాడిపత్రిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో వేంకటేశ్వర స్వామి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లడ్డూ తయారీలో ఎటువంటి కల్తీ జరగలేదని స్పష్టం చేశారు. అలాగే చింతల వేంకటరమణస్వామి ఆలయంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కొనుదుల రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నీచ రాజకీయాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు.
మనోభావాలతో ఆటలొద్దు
రాజకీయ ప్రయోజనాల కోసం హిందువుల మనోభావాలతో ఆటలాడుకోవద్దంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య హితవు పలికారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలను నిరసిస్తూ కళ్యాణదుర్గంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బోయ తిప్పేస్వామి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడగట్ట నారాయణ, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణపురం వెంకటేశులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ములకనూరు తిమ్మరాయుడు పాల్గొన్నారు.
సిట్ నివేదిక చంద్రబాబుకు చెంపపెట్టు
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం తయారీలో ఎటువంటి కల్తీ జరగలేదని సీబీఐ సిట్ ఇచ్చిన నివేదిక ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెంపపెట్టు లాంటిదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న అన్నారు. శనివారం ఉరవకొండలోని లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఇక నుంచైనా విష ప్రచారం ఆపాలని కోరారు. చంద్రబాబు తన స్వార్ధ రాజకీయాల కోసం లడ్డూలో జంతువుల కొవ్వు ఉందని చెప్పడం సిగ్గుచేటన్నారు.
తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని తేలిపోయింది
చంద్రబాబు, పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలి
వైఎస్సార్‌సీపీ నాయకుల డిమాండ్
జిల్లా అంతటా వేంకటేశ్వరస్వామికి పూజలు


