చివర్లో పెరిగిన ‘చలి’గింతలు | - | Sakshi
Sakshi News home page

చివర్లో పెరిగిన ‘చలి’గింతలు

Feb 1 2026 3:19 AM | Updated on Feb 1 2026 3:19 AM

చివర్

చివర్లో పెరిగిన ‘చలి’గింతలు

తనకల్లులో 9.4 డిగ్రీలు, రాప్తాడులో 12.4 డిగ్రీలు

అనంతపురం అగ్రికల్చర్‌: సీజన్‌ చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో ‘చలి’ గింతలు పెరిగాయి. వారం రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సంక్రాంతి పండుగ సమయంలో రాత్రి ఉష్ణోగ్రతలు 15 నుంచి 18 డిగ్రీల మధ్య నమోదు కావడంతో చలి తగ్గుముఖం పడుతూ వచ్చింది. అయితే వారం రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు మళ్లీ 10 నుంచి 15 డిగ్రీలకు చేరుకున్నాయి. దీంతో చలి వాతావరణం పెరిగింది. ఉదయం పూట పొగమంచు ఆవరిస్తోంది. శనివారం శ్రీసత్యసాయి జిల్లా తనకల్లులో 9.4 డిగ్రీలు, గాండ్లపెంటలో 9.8 డిగ్రీలు, మడకశిరలో 10.1 డిగ్రీలు.. ఇలా కొన్ని మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు అనంతపురం జిల్లా రాప్తాడులో 12.4 డిగ్రీలు, కంబదూరు, పుట్లూరు, కుందుర్పి, శెట్టూరు, గుమ్మఘట్ట, విడపనకల్లు తదితర మండలాల్లో కూడా 12 నుంచి 14 డిగ్రీల మధ్య నమోదు కావడంతో చలి ప్రభావం కనిపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు గత 15 రోజులుగా 30 నుంచి 34 డిగ్రీల మధ్య స్థిరంగా నమోదవుతున్నాయి. మధ్యాహ్న సమయంలో కాస్తంత ఎండ వేడి కనిపిస్తోంది. ఈనెల 15 వరకు ఉదయం పొగమంచు, చలి వాతావరణం కొనసాగే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

రేపు విధుల్లోకి కలెక్టర్‌ ఆనంద్‌

అనంతపురం అర్బన్‌: కలెక్టర్‌ ఆనంద్‌ ఈ నెల 2న విధులకు హాజరుకానున్నారు. ముస్సోరిలో జనవరి 5 నుంచి 30 వరకు ఐఏఎస్‌లకు ఇచ్చిన మిడ్‌ కెరీర్‌ ట్రైనింగ్‌కు కలెక్టర్‌ వెళ్లిన విషయం విదితమే. శిక్షణ ముగించుకుని కలెక్టర్‌ ఆదివారం అనంతపురం చేరుకుంటారు. సోమవారం విధులకు హాజరవుతారని కలెక్టరేట్‌ వర్గాలు తెలిపాయి.

శ్రావణిశ్రీకి ‘తమ్ముళ్ల’ సెగ

శింగనమల: ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీకి సొంత పార్టీ కార్యకర్తల నుంచే నిరసన సెగ తగిలింది. నాగులగుడ్డం తండాలో శనివారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ చేపట్టారు. అయితే ఆమె గ్రామంలోకి రాగానే స్థానిక సమస్యలపై టీడీపీ కార్యకర్తలు ఏకరువు పెట్టారు. అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదన్నారు. అందుకే తాను వచ్చానని, మీ గ్రామానికి రూ.2.47 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామంలో ఎక్కడా పనులు జరగలేదంటూ కార్యకర్తలు నిలదీశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని వారికి సర్దిచెప్పాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీకి సంబంధించి తమకు సమాచారం ఇవ్వకుండా ప్రొటోకాల్‌ ఉల్లంఘించారని సర్పంచ్‌ లక్ష్మీదేవి, ఎంపీటీసీ సభ్యురాలు అంజినమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

ముగిసిన ఏపీపీఎస్సీ పరీక్షలు

అనంతపురం అర్బన్‌: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో 17 కేటగిరీలకు సంబంధించిన ఉద్యోగాలకు జనవరి 25 నుంచి నిర్వహించిన పరీక్షలు శనివారంతో ముగిశాయి. చివరి రోజున ఏపీపీఎస్సీ చైర్మన్‌ శశిధర్‌ పరీక్ష కేంద్రాలను సందర్శించి, పరీక్ష తీరును తనిఖీ చేశారు. అభ్యర్థులకు కల్పించిన సదుపాయాలను సమీక్షించారు. కార్యక్రమంలో లైజనింగ్‌ అధికారి ఉషారాణి పాల్గొన్నారు.

తరలిన జవాబుపత్రాలు

ఏపీపీఎస్సీ పరీక్షల జవాబుపత్రాలను కలెక్టరేట్‌ నుంచి విజయవాడకు ఆర్టీసీ బస్సులో తరలించారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఏఓ అలెగ్జాండర్‌, ఏపీపీఎస్సీ అధికారులు ప్రశాంత్‌కుమార్‌, మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు.

రేపు ‘పరిష్కార వేదిక’

అనంతపురం అర్బన్‌: కలెక్టరేట్‌ రెవెన్యూ భవన్‌లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కారవేదిక వేదిక నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ సి.విష్ణు చరణ్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పరిష్కార వేదికలోనే రెవెన్యూ క్లినిక్‌ ఉంటుందని పేర్కొన్నారు.

చివర్లో పెరిగిన ‘చలి’గింతలు 1
1/2

చివర్లో పెరిగిన ‘చలి’గింతలు

చివర్లో పెరిగిన ‘చలి’గింతలు 2
2/2

చివర్లో పెరిగిన ‘చలి’గింతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement