సై | - | Sakshi
Sakshi News home page

సై

Oct 15 2026 8:24 AM | Updated on Oct 15 2026 8:24 AM

● నవంబర్‌ 3న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ● 5న ఫలితాలు.. 26 నుంచి పంచాయతీ ఎన్నికలు ● అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్‌

స్థానిక సమరానికి
ప్రాదేశిక రిజర్వేషన్లు ఖరారు

సాక్షి, అనకాపల్లి : జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది. దీంతో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నవంబర్‌ 3న నిర్వహించి, 5న ఫలితాలు ప్రకటించనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నవంబర్‌ 26, 29, డిసెంబర్‌ 2 తేదీల్లో నిర్వహించనున్నారు. బుధవారం సాయంత్రానికి ఎంపీపీ, జెడ్పీటీసీల రిజర్వేషన్‌లతో పాటు, ఎంపీటీసీ సెగ్మెంట్‌ల రిజర్వేషన్‌ను కూడా కలెక్టర్‌ విడుదల చేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో కొత్త పథకాలు, విధాన నిర్ణయాల ప్రకటనలపై ఆంక్షలు వర్తించనున్నాయి. కొత్తగా ఏర్పటైన అనకాపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కిరీటం బీసీ మహిళకు కేటాయించగా, యలమంచిలి మున్సిపల్‌ చైర్మన్‌ జనరల్‌ మహిళకు, నర్సీపట్నం మున్సిపల్‌ చైర్మన్‌ బీసీ మహిళకు కేటాయించారు. దీనికి తోడు జీవీఎంసీలోని అనకాపల్లి జోన్‌కు సంబంధించి ఆరు కార్పొరేట్‌ స్థానాలు మహిళలకే కేటాయించడం గమనార్హం.

ఎన్నికల షెడ్యూల్‌ ఇదే..

నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నవంబర్‌ 3న నిర్వహించి, నవంబర్‌ 5న ఫలితాలు వెల్లడిస్తారు. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలను మొత్తం మూడు దశల్లో నిర్వహించనున్నారు. తొలి దశ నవంబర్‌ 26న, రెండో దశ నవంబర్‌ 29న, మూడో దశ ఎన్నికలు డిసెంబర్‌ 2న జరగనున్నాయి.

పోలింగ్‌ కేంద్రాల్లో తనిఖీలు

జిల్లాలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 1530 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మూడు రెవెన్యూ డివిజన్‌ల పరిధిలో విస్తరించి ఉన్న అనకాపల్లి జిల్లాలో 427 ఎంపీటీసీ స్థానాలకు, 24 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. పంచాయతీ ఎన్నికలకు గానూ 6,333 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 642 పంచాయతీలు, 6256 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 12, 28, 523 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అనకాపల్లి జోన్‌ పరిధిలోని 6 కార్పొరేటర్‌ స్థానాల్లో 79,950 మంది ఓటర్లు ఉన్నారు.

తుమ్మపాల : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని 24 మండలాలకు సంబంధించి మండల పరిషత్‌ అధ్యక్షుల (ఎంపీపీ), జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాల (జెడ్పీటీసీ) రిజర్వేషన్లను కలెక్టర్‌ విజయకృష్ణన్‌ విడుదల చేశారు. ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల్లో సగ భాగం మహిళలకు కేటాయించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, అన్‌రిజర్వుడ్‌ కేటగిరీల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. వీటితోపాటు ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్ల జాబితాను కూడా విడుదల చేశారు. 24 ఎంపీపీ స్థానాల్లో 12 స్థానాలను మహిళలకు, మరో 12 స్థానాలను జనరల్‌గా కేటాయించారు. కేటగిరీల వారీగా ఎస్టీ మహిళకు ఒక స్థానం, ఎస్సీ మహిళకు ఒకటి, ఎస్సీ ఒకటి, బీసీ మహిళలకు నాలుగు, బీసీ ఐదు, అన్‌రిజర్వుడ్‌ మహిళలకు ఆరు, అన్‌రిజర్వుడ్‌ ఆరు స్థానాలను కేటాయించారు. జెడ్పీటీసీ స్థానాల్లోనూ మహిళలకు 12 స్ధానాలు, మరో 12 స్థానాలను జనరల్‌గా కేటాయించారు. వీటిలో ఎస్టీ జనరల్‌కు ఒకటి, ఎస్సీ మహిళకు ఒకటి, ఎస్సీ జనరల్‌కు ఒకటి, బీసీ మహిళలకు ఐదు, బీసీ జనరల్‌కు నాలుగు, అన్‌ రిజర్వుడ్‌ మహిళలకు ఆరు, అన్‌రిజర్వుడ్‌ జనరల్‌కు ఆరు స్థానాలను కేటాయించారు. జెడ్పీ చైర్మన్‌ స్ధానాన్ని కూడా బీసీ మహిళకే కేటాయించారు.

జిల్లాలో ఎంపీపీ స్థానాల రిజర్వేషన్లు

అనకాపల్లి, కె.కోటపాడు, మాకవరపాలెం, రోలుగుంట బీసీ మహిళ, అచ్యుతాపురం, చోడవరం, పరవాడ, సబ్బవరం, గొలుగొండ బీసీ, బుచ్చెయ్యపేట, కశింకోట, దేవరాపల్లి, మునగపాక, రాంబిల్లి, ఎస్‌.రాయవరం అన్‌ రిజర్వ్‌డ్‌, యలమంచిలి, చీడికాడ, కోటఉరట్ల, నక్కపల్లి, నర్సీపట్నం, రావికమతం అన్‌ రిజర్వ్‌డ్‌ మహిళ, వి.మాడుగుల ఎస్టీ మహిళ, నాతవరం ఎస్సీ మహిళ, పాయకరావుపేట ఎస్సీ స్ధానాలకు కేటాయించారు.

జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లు

అనకాపల్లి, చోడవరం, కె.కోటపాడు, మాకవరపాలెం, నాతవరం, రోలుగుంట మండలాలను అన్‌ రిజర్వుడ్‌ కేటగిరీకి కేటాయించారు. అచ్యుతాపురం, రాంబిల్లి, పరవాడ, సబ్బవరం,పాయకరావుపేట, ఎస్‌.రాయవరం మండలాల్లో అన్‌ రిజర్వుడ్‌ మహిళ, బుచ్చెయ్యపేట, కశింకోట, దేవరాపల్లి, మునగపాక, రావికమతం మండలాల్లో బీసీ మహిళలకు, యలమంచిలి, చీడికాడ, వి.మాడుగుల, నర్సీపట్నం మండలాల్లో బీసీ, గొలుగొండ ఎస్టీ, కోటఉరట్ల ఎస్సీ మహిళకు, నక్కపల్లి ఎస్సీ కేటగిరీకి కేటాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement