అనకాపల్లి టౌన్: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపధ్యంలో అనకాపల్లి జోన్లో రాజకీయ సమీకరణాలు ఆసక్తిగా మారుతున్నాయి. జోన్ పరిధిలోని ఆరు వార్డులను మహిళలకు కేటాయించారు. 107, 108, 109, 111 వార్డులు బీసీ మహిళలకు కేటాయించగా, 110, 112 వార్డులు జనరల్ మహిళకు కేటాయించారు. దీంతో ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశపడుతున్న పలువురు పురుష అభ్యర్ధుల్లో నిరుత్సాహం నెలకొంది. ఇప్పటికే ఆయా వార్డుల్లో పోటీ చేసేందుకు సిద్దమై, ప్రజలతో మమేకమవుతూ సమావేశాలు, నిర్వహించారు.
తమదైన శైలిలో ప్రచారం చేసిన ఆశావహులకు రిజర్వేషన్లు కొత్త సవాలుగా మారాయి. ఆరు వార్డులకు మహిళలకు కేటాయించడంతో వారి అందచానలు తారుమారు అయ్యాయి. రిజర్వేషన్ల నేపధ్యంలో పోటీకి దూరం కావల్సిన పరిస్ధితి ఎదురవడంతో కొందరు పురుష ఆశావహులు తమ భార్యలను ఎన్నికల బరిలోకి దింపాలనే ఆలోచనలో ఉన్నట్లు వినికిడి. ఇంతకాలం చేసిన ప్రచార హడావుడి ఎన్నికల్లో తమ కుటుంబానికి ఉపయోగపడేలా పావులు కదుపుతున్నారు.


