వైఎస్సార్‌సీపీ పోరాటంతో కూటమి మెడలు వంచి పంచదార్ల కొండను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించేలా ఒత్తిడి తెచ్చామని, తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకో మార్గం లేక చంద్రబాబు ప్రభుత్వం జీవో ఇచ్చినా, ఇంకా దానిపై అనేక అనుమానాలు ఉన్నాయని ఉత్తరాంధ్ర పార్టీ సమన్వయకర్త కురసాల కన్నబాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల మద్దతుతో పంచదార్ల కొండపై జరిగిన అక్రమ మైనింగ్‌ను ఢిల్లీ స్థాయిలో కేంద్ర మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన జీవోలో స్పష్టత కొరవడిందన్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కూటమి నేతలు అక్రమ గ్రావెల్ తవ్వకాలకు తెగబడే అవకాశం ఉందని, అందుకే 32 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఫణిగిరి కొండను మొత్తంగా నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరిగితే కంటి తుడుపుగా ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకొన్న కూటమి ప్రభుత్వం అక్రమ తవ్వకాలు చేసిన, చేయించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కురసాల కన్నబాబు ఆరోపించారు.
యలమంచిలి రూరల్: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడాలని రాష్ట్ర శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర పార్టీ సమన్వయకర్త కురసాల కన్నబాబు,మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే, యలమంచిలి పార్టీ కో ఆర్డినేటర్ కరణం ధర్మశ్రీ అధ్యక్షతన రాంబిల్లి మండలం నారాయణపురం లక్ష్మీదేవుల కన్వెన్షన్ హాల్‌లో నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. నియోజకవర్గంలో నాలుగు మండలాల నుంచి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరైన ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ సీనియర్లు, మాజీ ఎమ్మెల్యేలు,పార్టీ సమన్వయకర్తలు రానున్న స్థానిక ఎన్నికల్లో ఒక్క వార్డుగానీ, ఒక్క ఊరు గానీ ఏకగ్రీవం కాకుండా పోటీ చేయాలన్నారు. రెండున్నరేళ్ల కూటమి పాలనలో కూటమి మోసాలు, వైఫల్యాలు, స్థానిక కూటమి నాయకుల అక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడగడానికి వచ్చే కూటమి నాయకులను ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతిపై నిలదీసేలా చేయాలన్నారు. చంద్రబాబు, కరువు కవల పిల్లలని, వర్షాలు లేక రైతులు పంటలు సాగు చేయలేదని, తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వ పాలన ఉందని, ఈ పరిస్థితుల్లో అనకాపల్లిని కరువు జిల్లాగా ప్రకటించాలన్నారు. చంద్రబాబు ప్రభుత్యం చేసిన మోసాలు ప్రజలకు వివరిస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఐక్యంగా పోరాటం చేయాలన్నారు. సమావేశంలో అరకు ఎమ్మెల్యే రేగా మత్స్యలింగం, యలమంచిలి, నర్సీపట్నం, పాయకరావుపేట, అనకాపల్లి, పెందుర్తి పార్టీ సమన్వయకర్తలు కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర గణేశ్, కంబాల జోగులు, మలసాల భరత్‌కుమార్, అన్నంరెడ్డి అదీప్‌రాజు, జెడ్పీ చైర్మన్ జల్లిపల్లి సుభద్ర, యలమంచిలి నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు కోలా గురువులు, అనకాపల్లి మాజీ ఎంపీ భీశెట్టి సత్యవతి, అనకాపల్లి పార్లమెంట్ పార్టీ పరిశీలకురాలు శోభా హైమావతి, బూడి అనూరాధ, పలివెల అమృతవల్లి, బోదెపు గోవింద్, బొద్దపు ఎర్రయ్యదొర, ధూళి నాగరాజు, కిషోర్‌రాజు, గొట్టుముక్కల శ్రీనుబాబు, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
పోలవరం నీళ్లు ఎక్కడ చంద్రబాబూ..
పంటల సాగు మాట అటుంచితే తాగడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితులు ఉంటే చంద్రబాబు మాత్రం అనకాపల్లి జిల్లాకు పోలవరం నీళ్లు ఇచ్చామని అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటున్నారని జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ మండిపడ్డారు. ఎక్కడా నీళ్లు లేవని వినాయక చవితి నిమజ్జనాలు ఎక్కడ చేసుకోవాలో అర్థం కాక జనం ఉన్నారన్నారు. వైఎస్సార్‌సీపీకి నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉందని, స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు. ప్రజలకు నీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం గ్రామ గ్రామాన విచ్చలవిడిగా మద్యం బెల్టు షాపులు మాత్రం అందుబాటులో ఉంచిందని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు ఘనత మహానేత వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుందన్నారు.
పంచదార్ల కొండ 32 ఎకరాలను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి
గుర్తింపు కార్డుల పంపిణీ
సమావేశంలో భాగంగా మండల, గ్రామ స్థాయి నాయకులకు పార్టీ గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తింపు కార్డులున్న నాయకులకు ప్రాధాన్యం ఉంటుందని బొత్స సత్యనారాయణ అన్నారు. గుర్తింపు కార్డు ఉంటే జగనన్న మనతో ఉన్నట్టేనని, దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ నాయకుడికి లేనంత దమ్ము, ధైర్యం జగనన్నకు ఉన్నాయని కురసాల కన్నబాబు అన్నారు. చంద్రబాబు రాజకీయమంతా పచ్చి అబద్ధాలు, వెన్నుపోట్లే అని ఆరోపించారు.


