తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల
22న కొత్త వార్డుల వారీ
ఫొటో ఓటర్ల జాబితా
జీవీఎంసీ కమిషనర్‌కేతన్‌గార్గ్
డాబాగార్డెన్స్: గ్రేటర్ విశాఖపట్నం నగర పాలక సంస్థలో ఇకపై 120 వార్డులు ఉండనున్నాయి. ప్రస్తుతం ఉన్న 98 వార్డులను 120 వార్డులుగా పునర్విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. కొత్త వార్డుల పరిధులు, సరిహద్దులను ఖరారు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ ప్రచురితమైందని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ తెలిపారు. వార్డుల పునర్విభజన ప్రక్రియలో భాగంగా తొలుత ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసి ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించారు. వాటిని పరిశీలించిన అనంతరం తుది ప్రతిపాదనలను ఖరారు చేసి 120 వార్డుల పునర్విభజనపై తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్టు కమిషనర్ వివరించారు. కొత్తగా ఏర్పాటైన ప్రతి వార్డుకు సంబంధించిన పరిధులు, సరిహద్దుల వివరాలను గెజిట్‌లో పొందుపరిచినట్టు పేర్కొన్నారు.
ఓటర్ల జాబితాలోనూ కొత్త వార్డులే..
కొత్త వార్డుల ప్రాతిపదికన ఓటర్ల జాబితాల రూపకల్పనకు కూడా జీవీఎంసీ సిద్ధమవుతోంది. పునర్విభజన చేసిన వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితాలను ఈ నెల 22న ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 15న నోటిఫికేషన్ జారీ చేసినట్టు కమిషనర్ తెలిపారు. ఈ ఏడాది జనవరి 1వ తేదీని అర్హత తేదీగా పరిగణనలోకి తీసుకుని, తాజా అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాల ఆధారంగా కొత్త వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితాలను సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. ఆయా జోన్ల పరిధిలో వార్డుల వారీ ఫొటో ఓటర్ల జాబితాల తయారీ, ప్రచురణ బాధ్యతలను సంబంధిత జోనల్ కమిషనర్లు నిర్వహిస్తారని రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్టు తెలిపారు.
మీ ప్రాంతం.. ఏ వార్డు?
వార్డుల పునర్విభజనతో నగరంలోని అనేక ప్రాంతాల వార్డు పరిధుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచించారు. గెజిట్‌లో పొందుపరిచిన కొత్త వార్డుల పరిధులు, సరిహద్దులను పరిశీలించి తమ నివాస ప్రాంతం ప్రస్తుతం ఏ వార్డు పరిధిలోకి వచ్చిందో తెలుసుకోవాలని కోరారు. అలాగే ఈ నెల 22న ప్రచురించే కొత్త వార్డుల వారీ ఫొటో ఓటర్ల జాబితాల్లో తమ పేర్లు, ఇతర వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు.


