నక్కపల్లి: ప్రాచీన పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారం ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఉత్సవ కావడి ఊరేగింపు
ఈ ఉత్సవాలకు సంబంధించి ఉదయం ఉత్సవ కావడిని మాడవీధుల్లో ఊరేగించడంతో ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమయినట్లేనని ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాద్ తెలిపారు. గరుడాద్రి పర్వతంపై కల్కి అవతారంలో స్వయంభూగా వెలసిన స్వామివారి మూలవిరాట్‌కు అభిషేకం, నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల ప్రారంభ సూచకంగా గ్రామ మాఢవీధుల్లో ఉత్సవ కావడి ఊరేగించారు. భక్తులు స్వామివారికి పసుపు కొమ్ములు, కుంకుమ, కొబ్బరి బొండాలు కానుకలు సమర్పించారు. అనంతరం స్వామివారి ఉత్సవ మూర్తులకు, సుదర్శన పెరుమాళ్లకు అర్చకులు స్వప్న తిరుమంజన కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలు అలంకరించారు. క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామికి ఉత్సవమూర్తులకు విశేష పూజలు నిర్వహించారు.
రాత్రి అంకురార్పణ
సోమవారం రాత్రి విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రుత్విక్ వరుణ, రక్షాబంధనం, అంతరాలయ పూజలతో కార్యక్రమాలు ప్రారంభించారు. అనంతరం సుదర్శన పెరుమాళ్లను పల్లకిలో ఉంచి గ్రామంలో ఉత్తర ఈశాన్య దిక్కున ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లి మత్స్యంగ్రహణ (పుట్టమన్ను) తెచ్చే కార్యక్రమం నిర్వహించారు..తాత్కాలిక యాగశాల వద్ద అంకురార్పణ, అగ్నిప్రతిష్టాపన చతుస్థాన అర్చనలు పూర్తిచేసి గరుడ ఆవాహన, గరుడ అప్పాల నివేదన కార్యక్రమాలు నిర్వహించారు.
నేత్రపర్వంగా ధ్వజారోహణం
బ్రహ్మోత్సవాల్లో మంగళవారం ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. గరుడాద్రిపై స్వయం వ్యక్తమై వెలసిన స్వామివారి మూలవిరాట్‌కు నిత్యాభిషేకం అర్చనలు పూర్తి చేశారు. కొండదిగువన ఉత్సవమూర్తుల వద్ద ప్రత్యేక ఆరాధనలు, అర్చనలు అనంతరం ధ్వజస్తంభం వద్ద ధ్వజారోహణ కార్యక్రమాన్ని అర్చక స్వాములు ప్రసాదాచార్యులు, కృష్ణమాచార్యులు, శేషాచార్యులు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ప్రారంభ సూచకంగా ధ్వజపటాన్ని ఎగుర వేశారు. అశ్వవాహనంపై స్వామివారికి తిరువీధి సేవలు నిర్వహించారు. ఈ నెల 14 నుంచి 23 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. రథోత్సవం, వసంతోత్సవం, మృగవేట ఉంగరపు సేవ వంటి ప్రధాన ఘట్టాలను తిలకించేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు.


