ఖాకీల్లో కాక | - | Sakshi
Sakshi News home page

ఖాకీల్లో కాక

Jul 30 2026 1:27 AM | Updated on Jul 30 2026 1:27 AM

గిరి ప్రదక్షిణ వైఫల్యం

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:

సింహాచలేశుని గిరి ప్రదక్షిణ నిర్వహణలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విమ ర్శలు వ్యక్తమవుతున్నాయి. సరైన ట్రాఫిక్‌ ప్రణాళిక లేకపోవడంతో భక్తులతో పాటు సాధారణ ప్రజలు గంటల తరబడి రహదారులపైనే నరకయాతన అనుభవించారు. హనుమంతవాక నుంచి మద్దిలపాలెం, అడవివరం, హెచ్‌బీ కాలనీ, సింహాచలం పరిసర ప్రాంతాల వరకు ఎక్కడ చూసినా భారీ ట్రాఫిక్‌ స్తంభించింది. కొన్నిచోట్ల 5 నుంచి 6 గంటలపాటు వాహనాలు ఇంచు కూడా ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. ఈ వైఫల్యానికి సంబంధించి ఇద్దరు ఐపీఎస్‌ అధికారుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. గిరి ప్రదక్షిణ నిర్వహణకు అవసరమైన అదనపు సిబ్బందిని సకాలంలో అందించలేదని ఒక ఉన్నతాధికారి ఆరోపించగా, గత ఏడాదికంటే ఎక్కువ మంది సిబ్బందిని కేటాయించినప్పటికీ వారిని సమర్థంగా వినియోగించుకోలేకపోయారని మరో ఉన్నతాధికారి ఎదురుదాడి చేసినట్లు తెలిసింది. మరోవైపు పోలీసు కమిషనర్‌కు కొందరు సిబ్బంది పూర్తిస్థాయిలో సహకరించలేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫారసులకు అనుగుణంగా పోస్టింగులు ఇవ్వలేదనే అసంతృప్తితో కొందరు నాయకులు సీపీపై ఇప్పటికే అసహనం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఇదే అంశాన్ని ఆధారంగా చేసుకుని గిరి ప్రదక్షిణ నిర్వహణలో వైఫల్యం చెందారంటూ సీపీపై డీజీపీకి ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ నిర్వహణలో జరిగిన లోపాలపై వివరణ ఇవ్వాలని డీజీపీ విశాఖ సీపీని ఆదేశించినట్టు తెలిసింది.

గంటల తరబడి ట్రాఫిక్‌లో నరకయాతన

గిరి ప్రదక్షిణకు రెండు నెలల ముందే కలెక్టర్‌, పోలీసు కమిషనర్‌, జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ కమిషనర్లతో పాటు ఇతర ఉన్నతాధికారులు పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. గిరిమార్గాన్ని 32 సెక్టార్లుగా విభజించి, ప్రతి సెక్టార్‌కు ప్రత్యేక అధికారులు, సిబ్బందిని నియమించారు. ఇద్దరు ఐపీఎస్‌ అధికారులు, ఇద్దరు నాన్‌ కేడర్‌ అధికారులు పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టారు. గత ఏడాది పశ్చిమ సబ్‌డివిజన్‌లో 1,045 మంది సిబ్బంది విధులు నిర్వహించగా, ఈసారి 1,007 మందితో పాటు రోప్‌ పార్టీ కింద మరో 200 మందిని అదనంగా మోహరించారు. ఇంత భారీగా బలగాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో సమన్వయం లోపించడంతో ట్రాఫిక్‌ వ్యవస్థ కుప్పకూలింది. హనుమంతవాక నుంచి సింహాచలం వరకు రహదారులు వాహనాలతో నిండిపోయాయి. చిన్నారులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడగా, అంబులెన్సులు సైతం ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తాగునీరు, ఆహారం లేక అవస్థలు ఎదుర్కొన్నారు. ఈ వైఫల్యంపై పోలీసు శాఖలోనే పరస్పర ఆరోపణలు మొదలయ్యాయి. అవసరమైన అదనపు సిబ్బందిని సకాలంలో కేటాయించలేదని ఒక ఉన్నతాధికారి అభ్యంతరం వ్యక్తం చేయగా, అందుబాటులో ఉన్న బలగాలను సమర్థంగా వినియోగించుకోలేకపోవడమే వైఫల్యానికి కారణమని మరో అధికారి వాదించినట్టు తెలిసింది. ఈ అంశంపై ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

సహకరించని సిబ్బంది!

గిరి ప్రదక్షిణ విధుల్లో కొందరు పోలీసులు పూర్తిస్థాయిలో సహకరించలేదనే ఆరోపణల వెనుక పోస్టింగుల వ్యవహారమే ప్రధాన కారణమనే చర్చ పోలీసు శాఖలో సాగుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫారసుల మేరకు కొందరికి పోస్టింగులు ఇవ్వకుండా, అవినీతి ఆరోపణలు లేదా సామర్థ్యం లేమిని కారణంగా చూపుతూ విశాఖ సీపీ వారిని పక్కన పెట్టినట్లు సమాచారం. వారి స్థానంలో స్వయంగా ఎంపిక చేసిన అధికారులను కీలక బాధ్యతల్లో నియమించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పోస్టింగులు దక్కని కొందరు సిబ్బంది విధుల్లో ఆశించిన స్థాయిలో చురుకుదనం ప్రదర్శించలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో ఎమ్మెల్యేల నుంచి కూడా సీపీపై అసంతృప్తి వ్యక్తమవడంతో, గిరి ప్రదక్షిణ నిర్వహణ వైఫల్యాన్ని ఆయుధంగా చేసుకుని వరుస ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి నివేదిక సమర్పించాలని రాష్ట్ర డీజీపీ విశాఖ సీపీని ఆదేశించినట్టు పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఇద్దరు ఐపీఎస్‌ల మధ్య బాధ్యతల వార్‌

సీపీకి సహకరించని పోలీసు సిబ్బంది?

పోస్టింగుల పంచాయితీతో

రాజకీయ అసంతృప్తి

ఇదే అదనుగా సీపీపై ఫిర్యాదులు

వివరణ ఇవ్వాలంటూ డీజీపీ ఆదేశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement