ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని సహించేది లేదు | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని సహించేది లేదు

Jul 30 2026 1:27 AM | Updated on Jul 30 2026 1:27 AM

తుమ్మపాల: ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల అమలు, మీసేవ ద్వారా సేవలందించడంలో ఎలాంటి జాప్యం జరిగినా సహించేది లేదని కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ హెచ్చరించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో వివిధ శాఖల పనితీరు, మౌలిక సదుపాయాలు, రేషన్‌ పంపిణీ, పింఛన్లు, మీసేవ దరఖాస్తులు, ఈ–కేవైసీ, రీ–సర్వే, మ్యుటేషన్ల పురోగతిపై సమీక్షించారు. తాగునీరు, విద్యుత్‌, రహదారులు, పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్ల అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలన్నారు. నిలిచిపోయిన రహదారి పనులు, కనెక్టివిటీ సమస్యలను ప్రణాళికాబద్ధంగా వెంటనే పరిష్కరించాలని సూచించారు. రేషన్‌, పింఛన్ల పంపిణీలో జాప్యం ఉండరాదని, కాలనీలు, మారుమూల గ్రామాల్లో సకాలంలో అందేలా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. పింఛన్ల మ్యాపింగ్‌లో సాంకేతిక సమస్యలను డీఆర్‌డీఏ, గ్రామ,వార్డు సచివాలయాల అధికారులతో సమన్వయం చేసుకుని వెంటనే పరిష్కరించాలని తెలిపారు. మీసేవ పోర్టల్‌లో ఆదాయ, కుల, ఓబీసీ, భూమి విలువ, , కుటుంబ సభ్యుల ధ్రువీకరణ, జనన–మరణాల నమోదు దరఖాస్తులు అధికంగా పెండింగ్‌లో ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం పరిశీలించి అన్ని దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. ప్రజా సేవల అమలులో నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్‌.రాయవరం మండలంలో రీ–రిజెక్షన్లు లేకపోయినా, గడువు దాటిన 55 శాతం దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడాన్ని తప్పుబట్టారు. జిల్లాలో సగటున 11 శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురవగా, కొన్ని ప్రాంతాల్లో 40 శాతం వరకు తిరస్కరణలు నమోదవడంపై సంబంధిత అధికారులు స్పష్టమైన కారణాలు తెలియజేయాలని ఆదేశించారు. మాకవరపాలెం మండలంలో 81 శాతం, అచ్యుతాపురం మండలంలో 86 శాతం రీ సర్వే పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. సెప్టెంబర్‌ నాటికి లక్ష్యాలను పూర్తిచేయాలని సూచించారు. నునపర్తి గ్రామంలో మొత్తం 823 ఖాతాలు ఉండగా, డ్రాఫ్ట్‌ పూర్తయి 107 రోజులు గడిచినా వచ్చిన 40 దరఖాస్తుల్లో 20 మాత్రమే పరిష్కరించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి పూర్తి చేయాలని, తహసీల్దార్‌ లాగిన్‌న్‌లలో పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను వేగంగా క్లియర్‌ చేయాలని ఆదేశించారు. ఆస్తులు స్వాధీనం చేసుకున్న తర్వాత తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లల పట్ల అధికారులు ఎలాంటి సానుభూతి చూపాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇటువంటి కేసులను ఆర్‌డీవోల దృష్టికి తీసుకెళ్లి సీనియర్‌ సిటిజన్‌్స్‌ చట్టం ప్రకారం విచారణ జరిపి, అవసరమైతే తల్లిదండ్రులకు నెలవారీ జీవన భృతి కల్పించడం, వారు ఇచ్చిన ఆస్తుల రిజి స్ట్రేషన్‌ను రద్దు చేసి తిరిగి తల్లిదండ్రుల పేర్లపై నమోదు చేసే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తల్లిదండ్రులు, పిల్లల మధ్య వివాదాల్లో న్యాయం జరిగేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌, డీఆర్వో వై.సత్యనారాయణరావు, ప్రత్యేక డిప్యూ టీ కలెక్టర్లు కె.మనోరమ, అనిత, సుబ్బలక్ష్మి, జిల్లా పౌర సరఫరాల అధికారి మూర్తి, ఆర్‌డీవోలు షేక్‌ అయిషా, వి.వి. రమణ, ఏడీ సర్వే గోపాలరాజా, మండలాల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ విజయ కృష్ణన్‌

ప్రతి రైతుతో పంట బీమా చేయించాలి

తుమ్మపాల: వ్యవసాయంలో ఎదురైన అనిశ్చితి, సాగు నీటి ఎద్దడి వల్ల నష్టపోకుండా ఉండేందుకు ప్రతి రైతుతో తప్పనిసరిగా పంటబీమా చేయించాలని కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరం నుంచి అన్ని మండలాల వ్యవసాయ అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సొంత భూమి, కౌలు భూమి, ప్రభుత్వ భూముల్లో సాగు చేస్తున్న వరి పంటకు తప్పనిసరిగా బీమా చేసేలా అధికారులు కృషి చేయాలన్నారు. రైతులకు రుణాలు మంజూరు చేసే సమయంలో ఈ ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన పంట బీమా ప్రీమియం చెల్లించేలా అధికారులు, బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని చెప్పారు. కేవలం భూమి పత్రాలు చూసి రుణాలు నవీకరించడం మాత్రమే కాకుండా, రైతులకు బీమాపై అవగాహన కల్పించాలని సూచించారు. నీరు లేక పంట ఎండిపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని, ఇలాంటి కష్ట సమయంలో అధికారులు, బ్యాంకర్లు రైతులకు సరైన అవగాహన కల్పించి, నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. వ్యవసాయ శాఖ, ఇతర సంబంధిత శాఖల అధికారులకు ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, రైతుల సంక్షేమానికి అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఆశాజ్యోతి, బ్యాంక్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement