దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు
నేపథ్యంలో తలెత్తిన చిక్కులు
ఉమ్మడి సీనియారిటీ కొనసాగింపునకు
రైల్వే బోర్డు గ్రీన్‌సిగ్నల్
18 వేల మంది ఉద్యోగుల బదిలీలకు
త్వరలో మార్గదర్శకాలు
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆవిర్భావం తర్వాత పూర్వ వాల్తేరు డివిజన్ పరిధిలోని వేలాది మంది ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్న సీనియారిటీ, బదిలీలు, పదోన్నతుల సమస్యకు ఎట్టకేలకు పరిష్కార మార్గం కనిపిస్తోంది. జూన్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించడంతో విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్లతో పాటు కొత్తగా విశాఖపట్నం, రాయగడ డివిజన్లు ఏర్పడ్డాయి. ఈ పునర్వ్యవస్థీకరణలో పూర్వ వాల్తేరు డివిజన్ రెండు భాగాలుగా విడిపోయి, సుమారు 10 వేల మంది సిబ్బందితో విశాఖపట్నం డివిజన్, మరో 8 వేల మంది సిబ్బందితో రాయగడ డివిజన్ ఏర్పాటయ్యాయి. అయితే ఈ భౌగోళిక విభజనతో సీనియారిటీ, పదోన్నతులు, అంతర్‌డివిజన్ బదిలీల విషయంలో తలెత్తిన అనిశ్చితి ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది.
సరిహద్దు ప్రాంతాల్లో
తెలుగు ఉద్యోగుల ఇబ్బందులు
గతంలో వాల్తేరు డివిజన్ పరిధి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు విస్తరించి ఉండేది. ప్రస్తుతం కొత్తవలస–కిరండూల్ (కేకే) లైన్, కూనేరు–రాయగడ మార్గాలు రాయగడ డివిజన్ పరిధిలోకి వెళ్లాయి. దీంతో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న వందలాది మంది తెలుగు ఉద్యోగులు సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు లేదా విశాఖపట్నం డివిజన్‌కు బదిలీ అయ్యే విషయంలో అనిశ్చితి నెలకొంది. మరోవైపు, విశాఖపట్నం డివిజన్ పరిధిలో కొనసాగుతున్న ఒడిశాకు చెందిన ఉద్యోగులు తమ సొంత రాష్ట్రంలోని రాయగడ లేదా ఖుర్దా రోడ్ డివిజన్లకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్నారు.
న్యూఢిల్లీలో కీలక సమావేశం
ఈ సమస్య తీవ్రతను గుర్తించిన గుర్తింపు పొందిన రైల్వే కార్మిక సంఘాల నాయకులు రైల్వే బోర్డు, జోనల్ ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో ఈ నెల 24న న్యూఢిల్లీలోని రైల్వే బోర్డు ప్రధాన కార్యాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. రైల్వే బోర్డు మానవ వనరుల విభాగం అధికారులు, ఈస్ట్ కోస్ట్ రైల్వే, దక్షిణ కోస్తా రైల్వే జోన్ల చీఫ్ పర్సనల్ ఆఫీసర్లు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సుదీర్ఘ చర్చల అనంతరం సమస్య పరిష్కారానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.
ఉమ్మడి సీనియారిటీకి గ్రీన్ సిగ్నల్
సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం రైల్వే బోర్డు నిర్దిష్ట ‘కటాఫ్’ తేదీని ప్రకటించే వరకు పూర్వ వాల్తేరు డివిజన్ ఉమ్మడి సీనియారిటీ జాబితాలనే యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో విభజన కారణంగా సీనియారిటీ కోల్పోతామనే ఉద్యోగుల ఆందోళనకు తెరపడనుంది. అదేవిధంగా పరస్పర ఆప్షన్ల ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉద్యోగులను విశాఖపట్నం డివిజన్‌కు, ఒడిశాకు చెందిన ఉద్యోగులను రాయగడ లేదా ఖుర్దా రోడ్ డివిజన్లకు బదిలీ చేసేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలోనే రైల్వే బోర్డు విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. భవిష్యత్తులో సాంకేతిక లేదా పరిపాలనా పరమైన సమస్యలు ఎదురైనా వాటిని దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. దీంతో సుమారు 18 వేల మంది ఉద్యోగుల్లో నెలకొన్న అనిశ్చితికి తెరపడనున్నట్లు భావిస్తున్నారు.


