మహారాణిపేట: కేజీహెచ్‌లో ఆక్సిజన్, మందుల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ నివేదిక సమర్పించినా, అనుమానాలు మాత్రం తొలగడం లేదు. కోట్ల రూపాయల ప్రజాధనానికి సంబంధించిన అంశాలపై జరిగిన విచారణ నిజంగా లోతుగా సాగిందా? లేక కేవలం అధికారుల వివరణలకే పరిమితమైందా? అన్న ప్రశ్నలు ఆస్పత్రి వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఆరోపణలను వెలుగులోకి తీసుకురావాల్సిన కమిటీ.. వాస్తవాలను బయటపెడుతుందా? లేక వ్యవస్థలోని వారినే కాపాడేలా వ్యవహరిస్తుందా? అన్న చర్చ మొదలైంది.
రూ.1.4 కోట్ల ఆక్సిజన్ బిల్లులపై సందేహాలు
ఫిర్యాదుల ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు సుమారు రూ.1.4 కోట్ల విలువైన ఆక్సిజన్ బిల్లులు చెల్లించినట్లు తెలుస్తోంది. అయితే ఆస్పత్రికి సరఫరా చేసిన ఆక్సిజన్ పరిమాణం, ట్యాంకర్ల రాకపోకల వివరాలు, వినియోగ రికార్డులు, బిల్లుల్లో చూపిన మొత్తాల మధ్య వ్యత్యాసాలపై పూర్తిస్థాయి పరిశీలన జరిగిందా? అన్నది ప్రశ్నగా మారింది. ఆక్సిజన్ సరఫరా వ్యవహారంలో కీలకంగా ఉండే రికార్డులు, స్టాక్ వివరాలు, వినియోగ ధ్రువీకరణ పత్రాలపై విచారణ కమిటీ దృష్టి సారించిందా లేదా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.
ఆ సంతకం ఎవరు చేశారు?
ఆక్సిజన్ బిల్లుల వ్యవహారంలో మరో కీలక అంశం సంతకాల వివాదం. సీఎస్‌ఆర్‌ఎంవో, ఇన్‌చార్జ్ సీఎస్‌ఆర్‌ఎంవోలు విచారణ కమిటీ ముందు తాము ఆక్సిజన్ బిల్లులపై సంతకాలు చేయలేదని రాతపూర్వకంగా వెల్లడించినట్టు సమాచారం. అయితే సీఎస్‌ఆర్‌ఎంవో పేరుతో బిల్లులపై సంతకం చేసిన వ్యక్తి ఎవరు? ఆ సంతకం ఎలా వచ్చింది? అన్న అంశాన్ని విచారణ కమిటీ తేల్చిందా? లేదా? అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. బిల్లుల్లో అవకతవకల అనుమానాలతోనే సంబంధిత అధికారులు సంతకాలకు దూరంగా ఉన్నారని, అనంతరం పరిపాలన విభాగానికి చెందిన కొందరు అధికారులు ఆ స్థానంలో సంతకాలు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్లాంట్లు ఉండగానే బయట నుంచి కొనుగోళ్లా?
కేజీహెచ్‌లో ఉన్న ఆరు ఆక్సిజన్ ప్లాంట్లలో నాలుగు ప్లాంట్లు మరమ్మతులకు గురైనట్లు తెలుస్తోంది. నిపుణుల అంచనా ప్రకారం తక్కువ ఖర్చుతో వాటిని పునరుద్ధరించే అవకాశం ఉన్నప్పటికీ, భారీగా బయటి నుంచి ఆక్సిజన్ కొనుగోళ్లు ఎందుకు కొనసాగించారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న వనరులను వినియోగించకుండా ప్రైవేటు సరఫరాదారులపై ఆధారపడటానికి కారణాలేమిటన్న అంశంపైనా సమగ్ర విచారణ అవసరమని ఆస్పత్రి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
మందుల కొనుగోళ్లలోనూ ఆరోపణలు
ఆక్సిజన్ వ్యవహారంతో పాటు మందుల కొనుగోళ్లపైనా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకప్పుడు కేజీహెచ్‌లో అందుబాటులో ఉన్న అనేక రకాల మందులు ప్రస్తుతం తగ్గిపోయాయని, బీపీ, ఇన్సులిన్, క్యాన్సర్, ఫిట్స్, థైరాయిడ్, యాంటీబయాటిక్స్ వంటి కీలక ఔషధాలు తరచూ అందుబాటులో లేక రోగులు బయట కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. మందుల కొరతకు కొనుగోలు విధానంలో లోపాలే కారణమా? నిల్వల నిర్వహణలో వైఫల్యమా? అన్నది కూడా తేలాల్సి ఉంది.
72 గంటల్లోనే నివేదిక
కోట్ల రూపాయల ఆరోపణలకు సంబంధించిన విచారణను కమిటీ కేవలం 72 గంటల్లో పూర్తి చేసి నివేదిక సమర్పించడం కూడా చర్చకు దారితీసింది. కీలక రికార్డుల పరిశీలన, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలు, కొనుగోలు ప్రక్రియ పరిశీలన వంటి అంశాలకు ఇంత తక్కువ సమయం సరిపోతుందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అంతర్గత విచారణపైనేఅనుమానాలు
అవకతవకల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవస్థలోనే అంతర్గత విచారణ జరగడంతో దాని విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విచారణ కమిటీ నిజాలను బయటకు తీస్తుందా? లేక వ్యవస్థలోని వారినే రక్షించే ప్రయత్నం చేస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ఆక్సిజన్, మందుల కొనుగోళ్లకే అవినీతి పరిమితమైందా? లేక గత రెండేళ్లలో జరిగిన అన్ని కొనుగోళ్లులోనూ లోపాలను పరిశీలించిందా తెలియాల్సి ఉంది. సర్జికల్ వస్తువులు, కంప్యూటర్ల కొనుగోళ్లు, ఆస్పత్రి నిర్వహణకు అవసరమైన సామగ్రి, అభివృద్ధి పనుల్లోనూ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఆస్పత్రిలో వినిపిస్తున్నాయి. గత రెండేళ్లలో జరిగిన అన్ని కొనుగోళ్లు, పనులపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


