అతివేగానికి నిండు ప్రాణం బలి | - | Sakshi
Sakshi News home page

అతివేగానికి నిండు ప్రాణం బలి

Jul 29 2026 1:40 AM | Updated on Jul 29 2026 1:40 AM

ఎదురెదురుగా ఢీకొన్న రెండు మినీ వ్యాన్లు

ఒకరికి మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

కాకరపాడు వద్ద ఘటన

అతివేగం మరో కుటుంబంలో విషాదాన్ని నింపింది. కాకరపాడు–రాజవొమ్మంగి సరిహద్దులో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మినీ వ్యాన్‌ డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందగా, మరో డ్రైవర్‌తో పాటు 14 ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. రెండు మినీ వ్యాన్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

కొయ్యూరు: అతివేగం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఒకరి ప్రాణాన్ని బలితీసుకోగా, మరో వ్యక్తిని దివ్యాంగుడిగా మార్చింది. అలాగే 14 ఏళ్ల బాలుడి ప్రాణాలకు ముప్పు తెచ్చింది. కాకరపాడు–రాజవొమ్మంగి సరిహద్దు ప్రాంతంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కొంగసింగికి చెందిన మినీ వ్యాన్‌ డ్రైవర్‌ కె. దొరబాబు (31) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో డ్రైవర్‌ విజయ్‌ కుడి చేయి విరగగా, మృతుడి పక్కనే ప్రయాణిస్తున్న 14 ఏళ్ల వై. తేజ తలకు తీవ్ర గాయాలయ్యాయి. మంప ఎస్‌ఐ సీదరి శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కొంగసింగి గ్రామానికి చెందిన దొరబాబు పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలం లోడును వాహనంలో జడ్డంగి తీసుకెళ్లాడు. తిరిగి కొంగసింగి వస్తున్నాడు. అదే సమయంలో మండలంలో ఎం.మాకవరానికి చెందిన విజయ్‌ ఎరువుల లోడును వాహనంలో రాజవొమ్మంగి తీసుకువెళ్తున్నాడు. అయితే కాకరపాడు దాటిన తర్వాత దొరబాబు వాహన వేగాన్ని నియంత్రించలేకపోయాడు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీ కొట్టారు. ఈ ఘటనలో దొరబాబు డ్రైవింగ్‌ చేస్తున్న వ్యాన్‌ నుజ్జు నుజ్జు అయింది. తీవ్ర గాయాలపాలైన దొరబాబు సంఘటన స్థలంలో మృతి చెందాడు. వాహనంలో అతని పక్కన ఉన్న తేజ తలకు గాయమైంది. మరోవైపు దొరబాబు ఢీ కొట్టిన వ్యాన్‌ పల్టీలుకొట్టింది.సమాచారం అందుకున్న 108 అంబులెన్స్‌ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన విజయ్‌, తేజలను రాజేంద్రపాలెం ఆస్పత్రికి తరలించారు. అక్కడికి చేరుకున్న ఎస్‌ఐ శ్రీనివాస్‌ గాయపడిన వారిని పరామర్శించి ప్రమాదానికి సంబంధించిన వివరాలు సేకరించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని నర్సీపట్నం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement