నక్కపల్లి: అమలాపురం పరిధిలో శ్మశాన స్థలాన్ని టీడీపీ నాయకుడు ఆక్రమించి, స్టీల్‌ప్లాంట్ రోడ్డుకోసం లీజుకు ఇచ్చాడని, ఆక్రమణదారుడిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం పార్టీ రాష్ట్రకార్యదర్శి వీసం రామకృష్ణ, రైతువిభాగం కార్యదర్శి సూరాకాసుల గోవిందుల ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆక్రమిత స్థలం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు మాట్లాడుతూ గ్రామస్తులు మరణిస్తే దహన సంస్కారాల కోసం కేటాయించిన స్థలాన్ని టీడీపీకి చెందిన బాబ్జీ అనే వ్యక్తి ఆక్రమించడంతోపాటు, స్టీల్‌ప్లాంట్ వాహనాలు రాకపోకల కోసం లీజుకు ఇచ్చాడన్నారు. స్టీల్‌ప్లాంట్ అధికారులు ఈ స్థలంలోంచి రోడ్డు నిర్మించారని చెప్పారు.దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తోందన్నారు. ఈవిషయాన్ని తహసీల్దార్ చిన్నికృష్ణకు ఫిర్యాదు చేయడంతో ఆయన ఆక్రమిత స్థలం వద్దకు వచ్చి పరిశీలించారు. తక్షణమే రోడ్డును తొలగించి యథావిధిగా ఈ స్థలాన్ని శ్మశానవాటికగా ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, వైఎస్సార్‌సీపీ నాయకులు కోరారు. లేకపోతే ఈ రోడ్డుపై రాకపోకలు సాగించే వాహనాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు స్టీల్‌ప్లాంట్‌యాజమాన్యంతో మాట్లాడతానని తహసీల్దార్ హామీ ఇచ్చారు. ఈ ఆందోళనలో స్థానిక నాయకుడు తళ్ల భార్గవ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
చర్యలు తీసుకోవాలని ఆక్రమిత స్థలం వద్ద ఆందోళన


