అనకాపల్లి: రాష్ట్రంలో డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై చంద్రబాబు ప్రభుత్వం తక్షణమే సీబీఐ విచారణ చేయాలని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ పశ్చిమ గోదావరి జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు జిల్లా విద్యార్థి, యువజన విభాగం అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్, బొడ్డేపల్లి హేమంత్‌కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక రామచంద్ర థియేటర్ జంక్షన్ నుంచి నెహ్రూచౌక్ మీదుగా పెరుగుబజార్ జంక్షన్ వరకూ భారీ పాదయాత్ర (ర్యాలీ) నిర్వహించారు. తొలుత స్థానిక రామచంద్ర థియేటర్ జంక్షన్ వద్ద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త అదీప్‌రాజుతో కలిసి అమర్‌నాథ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమర్‌నాథ్ మాట్లాడుతూ నీట్ పరీక్షల పేపరు లీక్ విషయంలో కాక్రోజ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఢిల్లీలో ఉద్యమాలు చేయడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించిందన్నారు. రాష్ట్రంలో డీఎస్సీలో అక్రమాలను (పరీక్షలు, విద్యార్థుల సర్టిఫికెట్లు వెరిఫికేషన్, క్రీడా కోటలో ఉద్యోగాలు) దృష్టిలో పెట్టుకుని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగం, నిరుద్యోగులతో రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో విద్యా శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ రెండేళ్లలో అక్రమాలు, అవినీతితో కూటమి పాలన సాగుతుందని విమర్శించారు. డీఎస్సీలో అనేక అక్రమాలు జరిగినప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అన్యాయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగులు పోరాటాలు చేయకముందే విద్యా శాఖ మంత్రి లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని హితవు పలికారు. ఉత్తరాంధ్ర యువజన విభాగం వర్కింగ్ అధ్యక్షుడు, పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ మాట్లాడుతూ మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్ది, పేద విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే సంకల్పంతో తెలుగు, ఇంగ్లిష్ బోధన అమలు చేశారన్నారు. కూటమి పాలనలో విద్యను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయడం అన్యాయమన్నారు. పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త కంబాల జోగులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్య, వైద్యాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తోందన్నారు. పార్టీ విద్యార్థి, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు పుల్లేటి వెంకటేష్, బొడ్డేపల్లి హేమంత్‌కుమార్ మాట్లాడుతూ మెగా డీఎస్పీ దగా డీఎస్పీగా మారిందని ఎద్దేవా చేశారు. ‘రూ.15 నుంచి రూ.20 లక్షలు చెల్లించు...జాబ్ పట్టు’ అనే నినాదంతో డీఎస్పీ నియామకాలు జరిగాయన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు, నిరుద్యోగ భృతి తక్షణమే చెల్లించాలన్నారు. కార్యక్రమంలో నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్ గణేష్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం జోన్ –1 వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి మలసాల కుమార్‌రాజా, ఎంపీపీ గొర్లి సూరిబాబు, జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు జోసెఫ్, కశింకోట జెడ్పీటీసీ దంతులూరి శ్రీధర్‌రాజు, వివిధ నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు పెద్దిశెట్టి శేఖర్, ఆకుల సాయి ప్రసాద్, నరేష్ పోచిన, సియాద్రి బుజ్జి, తమరణ శ్రీనివాస్, గుద్దేటి శ్రీనివాస్, వివిధ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు, సీనియర్ నాయకులు బుదిరెడ్డి దేముడుబాబు, మళ్ల బుల్లిబాబు, ఉగ్గిన అప్పారావు, కె.ఎం.నాయుడు, బొడ్డేడ శివ, అల్లు త్రినాథ్, బుద్ధ భాస్కరరావు, పెద్దిశెట్టి గోవింద్, మలసాల కిషోర్, కార్యకర్తలు పాల్గొన్నారు.
లోకేష్ రాజీనామా చేయాల్సిందే..
డీఎస్సీ అక్రమాలకునైతిక బాధ్యత వహించాలి
లేకుంటే విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తాం
నిరుద్యోగుల భవిష్యత్తుతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటం
మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ధ్వజం
కదం తొక్కిన నిరుద్యోగులు,
విద్యార్థులు, పార్టీ శ్రేణులు
జిల్లా విద్యార్థి, యువజ విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ


