కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశాలు
తుమ్మపాల: అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ రానున్న నేపథ్యంలో అధిక సంఖ్యలో ప్రజల తరలివచ్చే అవకాశం ఉందని, అందుకు రవాణా సదుపాయాలు, భోజనం, వైద్య సహాయం, ఇతర ఏర్పాట్లను సక్రమంగా చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉన్నతాధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. బస్సుల కేటాయింపు, సమయపాలన, ప్రతి బస్సు లో 60 మంది చొప్పున ప్రయాణించేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. బోర్డింగ్ సమయానికి బస్సులను కేటాయించిన బోర్డింగ్ పాయింట్లకు చేరుకునే విధంగా అధికారులు చూడాలన్నారు. వైద్య సిబ్బంది ప్రతి బస్సులో ప్రథమ చికిత్స కిట్‌తోపాటు ఒక ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్త అందుబాటులో ఉండాలని తెలిపారు. ప్రయాణికులకు తాగునీరు, పులిహోర, బిస్కెట్లు, అరటి పండ్లు పంపిణీ చేయాలని, మధ్యాహ్న భోజనంగా వెజ్ బిర్యానీ, మజ్జిగను అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పార్కింగ్ స్థలం వద్ద అందజేయడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. మండల పరిషత్ కార్యాలయాల్లో ముగ్గురు సభ్యులతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి బస్సుల కదలికలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ప్రతి బస్సుకు ఇన్‌చార్జి, మెడికల్ ఇన్‌చార్జిని నియమించి సమన్వయం చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ శౌర్యమాన్ పటేల్, జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారా యణరావు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


