జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న రావికమతం దివ్యాంగ విద్యార్థులు
రావికమతం : రావికమతం మండలానికి చెందిన ముగ్గురు దివ్యాంగ విద్యార్థులు జాతీయ స్థాయి పారా ట్రయాత్లాన్ పోటీలకు ఎంపికై నట్టు ప్రత్యేక ఉపాధ్యాయులు మహాలక్ష్మి నాయుడు తెలిపారు. పారా స్పోర్ట్స్ అసోసియోషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్వర్యంలో విశాఖ బీచ్‌లోని పాండు రంగాపురం వద్ద గల ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆదివారం జరిగిన రాష్ట్ర స్దాయి పారా ట్రయాత్లాన్ పోటీల్లో సిమ్మింగ్, రన్నింగ్ , సైక్లింగ్ విభాగాల్లో రావికమతం మండలానికి చెందిన గట్టా బాబురావు, సలాది మురళీ, కొట్యాడ రాము పసిడి, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించి ప్రతిభ చాటారు. అంతకు ముందు ఈ నెల 23న ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష, పీఎంశ్రీ , పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా హీల్ పారాడ్రైస్ స్కూల్, తోటపల్లిలో జరిగిన రాష్ట్ర స్థాయి దివ్యాంగుల పారా స్పోర్ట్స్‌లో ఈ ముగ్గురు విద్యార్థులు బంగారం, సిల్వర్, బ్రాంజి మెడల్స్ సాధించారు. రాష్ట్ర స్థాయి పారా ట్రయాత్లాన్(స్విమ్మింగ్, రన్నింగ్, సైక్లిన్) క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన ఈ ముగ్గురు విద్యార్థులను జాతీయ స్థాయి పారా ట్రయాత్లాన్ పోటీలకు సెలక్టర్‌లు ఎంపిక చేశారు. జాతీయ స్థాయి పారా ట్రయాత్లాన్ క్రీడా పోటీలు ఆగస్టు 15న మహారాష్ట్రలోని పూణేలో జరుగుతాయని, ఆ పోటీలకు ఈ ముగ్గురు విద్యార్థులు హాజరవుతారని మహాలక్ష్మి నాయుడు తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న దివ్యాంగ విద్యార్థులను ఎంఈవో లింగమూర్తి, బ్రహ్మాజీ అభినందించారు.


