అన్ని వర్గాలను దగా చేసిన కూటమి ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

అన్ని వర్గాలను దగా చేసిన కూటమి ప్రభుత్వం

Jul 27 2026 1:00 AM | Updated on Jul 27 2026 1:00 AM

మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌

నర్సీపట్నం: అమలుకు సాధ్యం కాని హామీలతో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల వారిని దగా చేసిందని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ అన్నారు. వైఎస్సార్‌సీపీ నర్సీపట్నం రూరల్‌ మండల అధ్యక్షుడు శానపతి వెంకటరత్నం ఆధ్వర్యంలో దుగ్గాడ గ్రామంలో ఆదివారం జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం నెరవేర్చారన్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు ఓట్లు వేసి మోసపోయారని చెప్పారు. గత ప్రభుత్వంలో అమ్మ ఒడి, రైతు భరోసా ఎంత మందికి ఇచ్చామో సచివాలయాల్లో డేటా ఉండేదని చెప్పారు. ప్రస్తుతం ఎంత మందికి ఇస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. అమ్మ ఒడికి సంబంధించి రూ.14 వేలు తల్లి ఖాతాకు, స్కూల్‌ నిర్వహణకు రూ. వెయ్యి స్కూల్‌ ఖాతాలో వేస్తే టీడీపీ నాయకులు రాద్ధాంతం చేశారన్నారు. ప్రస్తుతం తల్లికి వందనం పేరుతో రూ.13 వేలు ఇస్తున్నారని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా నిరుద్యోగులకు మొండిచేయి చూపారన్నారు. ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తానన్న హామీని సైతం చంద్రబాబు అటకెక్కించారన్నారు.

నియోజకవర్గంలో 7 వేల ఓట్లు తొలగించారని చెప్పారు. ఈ తొలగించిన ఓట్లపై బీఎల్‌ఏలు దృష్టి సారించాలన్నారు. ఈ నెల 31న ఓటరు జాబితా ముసాయిదాను విడుదల చేస్తారని చెప్పారు. తొలగించిన వాటిలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లు ఉంటే తిరిగి చేర్పించాలని సూచించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తదితర అంశాలపై ఈ నెల 28న జరిగే నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలన్నారు. అంతా బాగానే చేస్తున్నామన్న భ్రమలో టీడీపీ నాయకులు ఉన్నారు. రాబోయే రోజుల్లో కూటమి నేతలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీ అనుబంధ కమిటీల సభ్యులకు త్వరలోనే ఐడెంటిటీ కార్డులు జారీ చేస్తామని చెప్పారు.అనంతరం గణేష్‌ను ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో ఎంపీపీ సుర్ల రాజేశ్వరి, పార్టీ మాకవరపాలెం, నాతవరం, గొలుగొండ మండల అధ్యక్షులు చిటికెల రమణ, నాగేశ్వరరావు, ఫాణిశాంతరామ్‌, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సుర్ల సత్యనారాయణ, నియోజకవర్గ బీసీ సెల్‌ అధ్యక్షులు గొంప కన్నయ్యనాయుడు, నియోజకవర్గ యూత్‌ అధ్యక్షులు తమరాన శ్రీను, విద్యార్థి విభాగం నాయకులు కిల్లాడ శ్రీనివాసరావు, ఎంపీటీసీ బోళెం వెంకటేష్‌, మండల బూత్‌ ఇన్‌ఛార్జీ తాతాజీ, నియోజకవర్గ బూత్‌ కమిటీల అధ్యక్షులు సుర్ల శేఖర్‌, జిల్లా ప్రచారక కమిటీ నాయకులు పిల్ల శ్రీను, పట్టణ యూత్‌ అధ్యక్షుడు అల్లంపల్లి ఈశ్వరరావు, పార్టీ నాయకులు నిద్ర శ్రీనివాసరావు, నల్లబెల్లి శ్రీను, గుడివాడ లోవరాజు, పెట్ల పెద అప్పలనాయుడు, నియోజకవర్గ ఎస్సీసెల్‌ నాయకులు చవల నాగేశ్వరరావు, యూత్‌ నాయకులు దన్నిన నానాజీ, మాజీ సర్పంచ్‌ పెట్ల అప్పలనాయుడు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement