రోలుగుంట : ఆస్పత్రి నుంచి మృతదేహం తరలించడానికి అంబులెన్సు ఏర్పాటుకు నిరాకరించిన అధికారుల తీరు అమానుషం అని, వారి తీరులో మార్పు రావాలని సీపీఎం నాయకుడు కె.గోవింద అన్నారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని అర్ల పంచాయతీ శివారు పీత్రుగెడ్డ గ్రామానికి చెందిన పీవీటీజీ కొందు గిరిజన జాతికి చెందిన కొర్ర సుబ్బారావు (56)ను నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం మృతి చెందాడు. మృతదేహన్ని ఇంటికి తరలించేందుకు తమకు ఆర్థిక స్థోమత లేదని అంబులెన్సు ఏర్పాటు చేయాలని ఆస్పత్రి సిబ్బందిని మృతుడి కుటుంబీకులు కోరారు. అయితే ఏజెన్సీ ప్రాంతాలకి మాత్రమే ఐటీడీఏ అంబులెన్సు అందుబాటులో ఉంటుందని, కొండ దిగువ గ్రామాలకు ఈ సేవలు వర్తించవని ఆస్పత్రి సిబ్బంది తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లగా, ఐటీడీఏ అంబులెన్సును వినియోగించుకోవాలని తెలిపారు. దీంతో మృతుడు కుమారుడైన కొర్రా కొండబాబు సీపీఎం జిల్లా కార్యదర్శి కె.గోవిందకు తెలియజేసి ఆయనతో కలిసి ఆర్డీవోకి సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ ఉదయం 8 గంటలకు చనిపోయిన మృతదేహాన్ని తరలించడానికి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ అంబులెన్సు అందుబాటులోకి రాలేదు. పాడేరు ఐటీడీఏ పీవో దృష్టికి సమస్య తీసుకెళ్లగా చివరకు పీవో జోక్యంతో అంబులెన్సు ఏర్పాటైన పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. ఆ తరువాత మృతదేహాన్ని పీత్రుగెడ్డ తరలించగా గ్రామానికి ఆరకిలోమీటరు దూరంలో అంబులెన్సు వెళ్లే పరిస్థితి లేక అక్కడ నుంచి పాడైపె భుజాన వేసుకొని అష్టకష్టాలతో మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లాల్సి వచ్చిందని బాధితులు తెలిపారు. సమస్య పరిష్కారానికి చొరవ చూసి సహకరించిన పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి మృతుడి కుటుంబీకులు, సీపీఎం నాయకుడు గోవింద ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మృతదేహంతో గంటల తరబడి గిరిజనుల నిరీక్షణ
ఆస్పత్రి వర్గాల అమానుష వైఖరిపై ఆవేదన
ఐటీడీఏ పీవో చొరవతో అంబులెన్స్ సమకూర్చిన వైనం


