అనకాపల్లి : దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేయని మంత్రులు రాజీనామా చేస్తే బాగుంటుందని, నీట్ పరీక్షల్లో పేపర్ లీక్‌పై చర్యలు తీసుకోవడంతో విఫలమైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత బీజేపీ ప్రభుత్వం రాజీనామా చేయించడం ప్రధాని మోదీ దృఢ నాయకత్వానికి నిదర్శమని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. స్థానిక రింగ్‌రోడ్డు తమ క్యాంపు కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో పోలీసులు దమనకాండ సృష్టించారని, నీట్ పరీక్షలో పేపర్ లీకేజీ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా నష్టపోయిన విద్యార్థులపై లాఠీఛార్జి చేయడం అన్యాయమన్నారు. మంత్రులు తమ శాఖల్లో ఆక్రమాలపై, సమస్యలపైన నిష్క్రియా విధానాన్ని అనుసరించడం రాజద్రోహం అవుతుందన్నారు. 2022 నీట్ పేపరు లీక్ వల్ల 8 మంది, 2026లో మరోసారి లీక్ వల్ల 21 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడితే, ప్రశ్నపత్రాలను ఉత్తర దేశం వారికి అమ్ముకునే మాఫియాపై ఏమి చర్యలు తీసుకుంటున్నారో అర్థం కావడంలేదన్నారు. నీట్ పేపర్ లీకేజీల్లో బాధ్యులను తక్షణమే అరెస్టు చేయాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పాలనలో బడ్జెట్ లీక్ అయినందుకు నాతో సహా 31 మంత్రుల చేత రాజీనామా చేయించడం జరిగిందన్నారు. పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సిబ్బందిపై నేటి వరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మాఫియాకు శిక్షలు విధించేలా చట్ట సవరణలు చేయడానికి ప్రధాని నిర్ణయించారని, నిందితులకు 10 సంవత్సరాలు జైలుశిక్ష, రూ.10 కోట్ల జరిమానా, కింది కోర్టు 3 నెలలు, హైకోర్టు 3 నెలలు దాటకుండా తీర్పులు ఇచ్చేలా పార్లమెంట్‌లో సవరణకు తీసుకోవడం మంచి పరిణామమన్నారు.
మాజీ మంత్రి దాడి వీరభద్రరావు


