విద్యాశాఖ మంత్రి లోకేష్‌ తక్షణమే రాజీనామా చేయాలి | - | Sakshi
Sakshi News home page

విద్యాశాఖ మంత్రి లోకేష్‌ తక్షణమే రాజీనామా చేయాలి

Jul 26 2026 1:56 AM | Updated on Jul 26 2026 1:56 AM

మాజీ డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు, మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌ డిమాండ్‌

దేవరాపల్లి/నర్సీపట్నం: రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, దానికి బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ తక్షణమే రాజీనామా చేయాలని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ బూడి ముత్యాలనాయుడు, నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ శనివారం వేర్వేరుగా డిమాండ్‌ చేశారు. కేంద్రంలో నీట్‌ ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతంపై విద్యార్థుల పోరాటానికి తలొగ్గి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తన పదవికి రాజీనామా చేశారని, అదే రీతిలో రాష్ట్రంలో డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్‌ రాజీనామా చేయాలన్నారు. కనీసం క్వాలిఫై కాకుండానే స్పోర్ట్స్‌ కోటాలో అనర్హులకు టీచర్‌ పోస్టులను కట్టబెట్టిన విషయాన్ని సాక్ష్యాధారాలతో మాజీ సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి బయటపెట్టారని గుర్తుచేశారు.

రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా డీఎస్సీలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని, కూటమి ప్రభుత్వ అసమర్థత వల్ల ఎందరో అభ్యర్థులు ఉద్యోగాలకు దూరమయ్యారని మండిపడ్డారు. బాధిత అభ్యర్థులు ప్రత్యక్షంగా మీడియా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని, అక్రమాలను బట్టబయలు చేసినప్పటికీ కూటమి ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం అత్యంత దారుణమన్నారు. ఎన్డీఏలో భాగస్వామి అయిన కూటమి ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థుల ఆక్రందనలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement