ఆనందపురం: తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లను తాళలేక కారు డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన మండల పరిధిలోని శొంఠ్యాం జగనన్న కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... కాలనీకి చెందిన కోరుకొండ హేమంత్ కుమార్ (27) కారు డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి 9.45 గంటల సమయంలో విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన హేమంత్, స్నానం చేసి తన గదిలోకి వెళ్లాడు. ఎంతసేపటికీ భోజనానికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి అప్పలకొండ గది తలుపులు తెరిచి చూడగా, హేమంత్ సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని కిందకు దించారు. శరీరం వెచ్చగా ఉండటంతో ప్రాణాలతోనే ఉన్నాడనే ఆశతో తక్షణమే ‘108’ అత్యవసర అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది హేమంత్‌ను పరీక్షించి, అతడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. గత కొంతకాలంగా ఎదురవుతున్న తీవ్ర ఆర్థిక ఇబ్బందుల వల్ల హేమంత్ తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యాడని, ఆ మనస్తాపంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు రోదిస్తూ తెలిపారు. మృతుడి తల్లి అప్పలకొండ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సూర్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం అనంతరం శనివారం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.


