అనకాపల్లి: స్థానిక నెహ్రూచౌక్ వద్ద జిల్లా వ్యవసాయశాఖలో విధులు నిర్వహిస్తున్న ఎంపీఈవోలకు ఏఈవోలు, ప్రజాసంఘాల నాయకులు శనివారం సంఘీభావం తెలియజేశారు. కనీస వేతనాలు అందించాలంటూ పెన్‌డౌన్ కార్యక్రమం చేస్తున్న వారికి విశాఖ ఉమ్మడి జిల్లాల ఏఈవోలు తమ వంతు సహాయంగా రూ.11వేలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఎంపీఈవోలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయశాఖలో విధులు నిర్వహిస్తున్న ఎంపీఈవోలు, ఉద్యోగులకు భద్రత కల్పిస్తూ పర్మినెంట్ ఉద్యోగులుగా చేస్తామని ఇచ్చిన హామీ రెండేళ్ల అవుతున్న నేటికీ అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమావేనవేతం ఇవ్వాలని, 12 సంవత్సరాలు ఉద్యోగికి నెలకు రూ.12వేలు ఇవ్వడం అన్యాయమన్నారు. బకాయిపడిన నాలుగు మాసాల జీతాలు తక్షణమే ప్రభుత్వం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో విశాఖ ఉమ్మడి వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం కార్యదర్శి కెబి.సూర్యనారాయణ, కోశాధికారి కోసూరు సత్యనారాయణ, పబ్లిసిటీ కార్యదర్శి ఎం.ఎన్.మూర్తి, గౌరవాధ్యక్షుడు జి.చిన్నదేముడు, ప్రజాసంఘాల నాయకులు వై ఎన్.భద్రం, వివి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.


