వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్
బీచ్‌రోడ్: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని, పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటీ సంస్థలు ఆకర్షితమై స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని వీఎంఆర్డీఏ చైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్ అన్నారు. శనివారం వీఎంఆర్డీఏ కార్యాలయంలో మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్. తేజ్ భరత్, సీఈ వినయ్‌కుమార్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ చేతుల మీదుగా భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కానుందని తెలిపారు. విమానాశ్రయానికి అనుసంధానంగా 15 ప్రధాన రహదారుల్లో ప్రాధాన్యమున్న ఏడు రహదారుల అభివృద్ధి పనులు వీఎంఆర్డీఏ, జీవీఎంసీ, ఆర్‌అండ్‌బీ శాఖల ఆధ్వర్యంలో వేగంగా జరుగుతున్నాయని, రూ.170 కోట్లతో 26 కి.మీ. మేర రహదారుల విస్తరణ చేపట్టి ఎక్కువ భాగం పూర్తి చేసినట్లు చెప్పారు. సంస్థ కమిషనర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ విమానాశ్రయానికి కోస్టల్ కారిడార్, గూగుల్ మ్యాప్స్, సైన్‌బోర్డులు, ఆర్టీసీ ఈవీ బస్సులు, ప్రయాణికుల కోసం లాంజ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.


