పోలవరం కాలువ పనులు అడ్డుకున్న సీతంపాలెం గ్రామస్తులు
నక్కపల్లి: సీతంపాలెం నుంచి వెదుళ్లపాలెం వెళ్లేందుకు ఏర్పాటు చేసుకున్న రహదారిని మూసివేసేందుకు పోలవరరం కాలువ కాంట్రాక్టర్లు ప్రయత్నించడాన్ని సీతంపాలెం గ్రామస్తులు అడ్డుకున్నారు. రోడ్డు తొలగించేందుకు సిద్ధపడడంతో ఎంపీటీసీ, వైఎస్సార్‌సీపీ మండల శాఖ అధ్యక్షుడు గొర్ల గోవిందరావు, తాజా మాజీ సర్పంచ్ గొర్ల నాగ అప్పలరాజు, మాజీ ఎంపీటీసీ గొనగాల రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రామస్తులంతా ప్రతిఘటించారు. సీతంపాలెం నుంచి వెదుళ్లపాలెం మీదుగా జాతీయ రహదారికి చేరుకునేందుకు ఎప్పటి నుంచో ఈ రోడ్డును ఉపయోగించుకుంటున్నామన్నారు. పోలవరం కాలువ కోసం దశాబ్దాల కిత్రం అతి తక్కువ ధరలకు భూములు ఇవ్వడం జరిగిందన్నారు. పోలవరం పనులకు తాము వ్యతిరేకం కాదన్నారు. సీతంపాలెం వెదుళ్లపాలెం వద్ద కాలువ కోసం మధ్యలో ఉన్న రోడ్డును తవ్వేస్తామని ఇంజినీరింగ్ అధికారులు హరిప్రసాద్, ఏఈ సతీష్‌లు సిద్ధపడడంతో గ్రామస్తులు అడ్డుకుని వారితో వాగ్వాదానికి దిగారు. సీతంపాలెం నుంచి రేబాక, తిరుపతిపాలెం, రేవళ్లు, వెదుళ్లపాలెం, సీహెచ్‌బి అగ్రహారం, నక్కపల్లి తదితర గ్రామాలకు రాకపోకలు సాగించేందుకు ఈ రోడ్డును ఉపయోగిస్తున్నామన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, వంతెన నిర్మించకుండా ప్రస్తుతం ఉన్న రోడ్డును తొలగిస్తే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని వివరించారు. బోదిగల్లం మీదుగా రాకపోకలు సాగించాలని అధికారులు సూచించారు. బోదిగల్లం మీదుగా రాకపోకలు సాగించాలంటే పది కిలోమీటర్లు అదనంగా వెళ్లాల్సి ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. కాలువ కోసం తవ్వకాలు చేపడితే ప్రత్యామ్నాయ రోడ్డు నిర్మించి అప్పుడు తవ్వకాలు జరపాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేసిన తర్వాతే ప్రస్తుతం ఉన్న మట్టి రోడ్డు తవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానికులు ప్రసాదుల సింహాద్రి, ఈగల గూడుపు రాజు, బొట్టాకాసులు, గొనగాల బాబ్జి,తదితరులు ఉన్నారు. గ్రామస్తులు వినతిపత్రం ఇస్తే ఉన్నతాధికారులకు పంపిస్తామని అధికారులు తెలిపారు.


