దేవరాపల్లి: స్థానిక బాలికల వసతి గృహ పనులను ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేయాలని సమగ్ర శిక్ష ఈఈ డి.వి. నరసింహారావు స్థానిక ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో రూ. 1.94 కోట్లతో నిర్మిస్తున్న బాలికల వసతి గృహ భవనాన్ని గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో టైప్–4 బాలికల వసతి గృహ భవనం గొలుగొండలో పునాది దశలో ఉందన్నారు. దేవరాపల్లిలోని భవనాన్ని త్వరగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో కేజీబీవీల్లో అదనపు వసతుల కోసం రూ. 23.28 కోట్లతో 12 భవనాల నిర్మాణం చేపట్టగా, అందులో 11 భవనాలు పూర్తయ్యాయన్నారు. వీటిలో దేవరాపల్లి, కె.కోటపాడు, అచ్యుతాపురం ప్రారంభించగా, నర్సీపట్నం, చోడవరం నియోజకవర్గాల్లో మూడు చొప్పున భవనాలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. అచ్యుతాపురం భవనం ఇంకా టెండర్ దశలో ఉందని స్పష్టం చేశారు. సమగ్ర శిక్ష డీఈ కె.గణేష్, స్థానిక ఏఈ పి. సంతోష్ తదితర ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
సమగ్ర శిక్ష ఈఈ నరసింహారావు ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశం


