కొమ్మాది: బీచ్ రోడ్డు సాగర్‌నగర్ తీరం వద్ద యథేచ్ఛగా సముద్రపు ఇసుకను తరలించేస్తున్నారు. ఎలాంటి అనుమతుల్లేకుండా బీచ్ ఇసుక తరలించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఉదయం 10 మంది మహిళలు ఇసుకను మూటలు కట్టి తరలించేందుకు సిద్ధమయ్యారు. దీంతో అక్కడ భారీ గోతులు ఏర్పడ్డాయి. దీన్ని గమనించిన స్థానికుల అడ్డుకున్నారు. ఇప్పటికే బీచ్ ముందుకు వచ్చేస్తోందని, కెరటాల తీవ్రతను అడ్డుకునే ఇసుక దిబ్బలు తవ్వి, తరలించుకుపోవడం ఏంటని ప్రశ్నించారు. అటవీశాఖ అధికారులు జూలో ఉన్న జంతువుల కోసం వీటిని తీసుకుని రమ్మన్నారని సదరు వ్యక్తులు చెప్పినట్లు స్థానికులు పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ ఉచిత ఇసుక నిబంధనల మేరకు నదులు, గెడ్డల్లో అధికారుల అనుమతితో ఇసుక తరలించవచ్చని, ఇలా బీచ్‌లో ఇసుక తీసుకుపోవడం ఏంటని ఆక్షేపిస్తున్నారు. ఇది పునరావృతం కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.


