పీజీఆర్‌ఎస్ అర్జీల నమోదుకు నిరీక్షణ
దివ్యాంగులకు కలెక్టర్‌ను కలిసే అవకాశం లేదంటూ ఆవేదన
అర్జీలు రాసుకునేందుకు కలెక్టరేట్ బయటే దిమ్మలే దిక్కు
తుమ్మపాల: ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు భారీ సంఖ్యలో జిల్లాలోని అర్జీదారులు తరలివచ్చారు.
ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో సత్యనారాయణరావు అర్జీదారుల సమస్యలను తెలుసుకుని అర్జీలు స్వీకరించి సంబంధిత అధికారులకు అందించారు. కాగా పీజీఆర్‌ఎస్ వెబ్‌సైట్ సాంకేతిక సమస్యతో సర్వర్ అంతరాయంతో అర్జీదారులు గంటల పాటు క్యూలైన్లలోనే కంప్యూటర్ల ముందు నిలిచిపోయారు. సౌకర్యాల లేమి, దివ్యాంగులకు ఎదురైన ఇబ్బందులతో పలువురు అర్జీదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కలెక్టరేట్ వద్దే ఉండి పోవాల్సి వస్తుందని, అయినా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని, దీంతో పదేపదే అర్జీలు చేస్తున్నామని అర్జీదారులు చెబుతున్నారు. ఫిర్యాదుల పురోగతిపై స్పష్టమైన సమాచారం అందడం లేదని, పొంతన లేని సమాధానాలతో ఎండార్స్‌మెంట్ ఇవ్వడమే పరిష్కారంగా అర్జీలను ముగించేస్తున్నారని వాపోతున్నారు.
ఆరుబయటే అర్జీలు రాత...
అర్జీదారుల సంఖ్యకు తగిన కూర్చునే ఏర్పాట్లు లేకపోవడంతో చాలామంది చెట్ల నీడలో, విగ్రహాల దిమ్మలపై కూర్చుని అర్జీలు రాసుకున్నారు. కొందరు నిల్చునే తమ దరఖాస్తులను సిద్ధం చేసుకున్నారు. తాగునీరు, విశ్రాంతి, వృద్ధులు–దివ్యాంగులకు ప్రత్యేక కౌంటర్లు వంటి సౌకర్యాలు మరింత మెరుగుపరచాలని కోరుతున్నారు.
90శాతం వైకల్యం ఉన్నా అందని పూర్తి స్థాయి పింఛను
ఓ దివ్యాంగుడి గోడు
నడుము విరిగిపోయి పూర్తిగా నడవలేని స్థితిలో ఉంటూ 90 శాతం వికలాంగుడిగా సదరం ధ్రువీకరణ ఉన్నప్పటికి పూర్తి స్థాయి రూ.15 వేలు పింఛను అందడం లేదని, కలెక్టర్ స్పందించి తనకు న్యాయం చేయాలంటూ రాంబిల్లి మండలం దిమిలి గ్రామానికి చెందిన మామిడి అప్పారావు భార్య సహాయంతో ఆటో కట్టించుకుని కలెక్టరేట్‌కు వచ్చానన్నాడు. అతన్ని కలెక్టరేట్ బయటే ఉంచి అర్జీని వేరొకరితో లోపలికి పంపించారని, రెండు గంటలుగా వేచి ఉన్నా ఎవరూ రాలేదని, కలెక్టర్‌ను కలిసే అవకాశం ఇస్తే తనను చూసి కనికరించైనా పింఛను మంజూరు చేస్తారేమోనని వచ్చానని, తీరా ఇక్కడ లోపలికి అనుమతించలేదని వాపోయాడు. ఎన్టీఆర్ ఆసుపత్రి డాక్టర్ వచ్చి సమస్య తెలుసుకున్నారని, అనవసరంగా వచ్చానని నిరాశ వ్యక్తం చేశారు.


