నర్సీపట్నం: భూ మాఫియా నుంచి ఆదివాసీల సాగు భూములను రక్షించి, మైనింగ్ మాఫియా నుంచి కల్యాణపులోవ రిజర్వాయర్‌ని కాపాడాలని సీపీఐఎంఎల్ లిబరేషన్ నాయకుడు కె.జనార్దన్ డిమాండ్ చేశారు. సోమవారం ఆర్డీవో కార్యాలయం వద్ద గిరిజనులతో కలిసి ఆయన నిరసన తెలియజేశారు. కార్యాలయం ఏవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ మాఫియా పెద్దపెద్ద యంత్రాలు, జేసీబీలతో రిజర్వాయర్‌ను కప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీంతో రిజర్వాయర్ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందన్నారు. అధికార పార్టీ నాయకులు, రెవెన్యూ, ఫారెస్టు అధికారుల అండతో మరింత రెచ్చిపోతున్నారన్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఆదివాసుల సాగుభూములను కాజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.


