చౌడువాడ నుంచి 8 కిలోమీటర్ల మేర పాదయాత్ర
కె.కోటపాడు తహసీల్దారు కార్యాలయం వద్ద 200 మందికిపైగా రైతులు నిరసన
రైత్వారీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్
కె.కోటపాడు: మూడు తరాలుగా సాగు చేస్తున్న భూములపై ఎటువంటి హక్కులు దఖలు పడకపోవడంతో పాచిలవానిపాలెం, చౌడువాడ, గరుగుబిల్లి గ్రామాల రైతులు రోడ్డెక్కారు. రైత్వారీ పట్టాలను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం చౌడువాడ నుంచి కె.కోటపాడు వరకూ 8 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పాదయాత్రను తొలుత వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి దాట్ల శివాజీరాజు, రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి దంతులూరి వర్మ ఇక్కడ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రారంభించారు. 200 మందికిపైగా రైతులు పాల్గొని ఎండను సైతం లెక్క చేయకుండా పాదయాత్రగా కె.కోటపాడు చేరుకున్నారు. అక్కడ మూడు రోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దారు కార్యాలయం వద్దకు చేరుకుని సాగు భూములకు హక్కులు కల్పించాలని నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దారు నాగరాజుకు వినతిపత్రం అందించారు. పరిశీలించి న్యాయం చర్యలు తీసుకోనున్నట్లు తహసీల్దారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ రొంగలి సూర్యనారాయణ మాట్లాడుతూ 1989లో విశాఖపట్నం ఆర్డీవో ఈ భూములు రైత్వారీ ఇనాంగా ధ్రువీకరించి ఉత్తర్వులు ఇచ్చారన్నారు. సాగుదారులకు భూహక్కులను కల్పించాలని అందులో పొందుపర్చినట్లు తెలిపారు. అప్పటి నుంచి అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించుకుంటున్నా సమస్యకు పరిష్కారం కాలేదని వాపోయారు. ఇప్పటికై నా మూడు గ్రామాల్లో 354 ఎకరాలు సాగు చేసుకుంటున్న 500 మంది రైతుల పేరున హక్కులను కల్పించాలని కోరారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కోన మోహన్‌రావు, కె.గౌరీశంకర్, లక్ష్మీకుమారి, న్యాయవాది పిళ్లా హరశ్రీనివాస్, నందారపు భాస్కరరావు, ఎంపీటీసీ ఏటుకూరి రాజేష్, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు ఆకుల సాయిప్రసాద్, వార్డు మాజీ మెంబర్ చల్లా సురేష్, పాల సంఘం అధ్యక్షుడు కోమార వెంకటరమణ, పాల సంఘం మాజీ అధ్యక్షుడు కోమార ఎర్రునాయుడు, ధనిమిశెట్టి అప్పారావు, గండి సత్యనారాయణ, సిరపరపు రమణారావు, పాచిల శ్రీనివాసరావు, వంటాకు గోవిందరావు, బొడ్డు దేముడుబాబు, జాగరపు కన్నంనాయుడు, సిరపరపు అప్పలనాయుడు, పోతల రమణారావు, తనకాల అప్పలకోటి, కోమార సోమునాయుడు తదితరులు పాల్గొన్నారు.


