మాడుగుల రూరల్: కె.జె.పురం పీహెచ్‌సీలో ఈ నెల 18వ తేదీన కూర్మానాథపురం గ్రామానికి చెందిన ఏలుసూరి నారాయణమ్మ రెండో కాన్పులో గర్భంలోనే మగ శిశువు మృతి చెందింది. ఈ సంఘటనపై జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి, నోడల్ అధికారి కె. చంద్రశేఖర్‌దేవ్ సోమవారం విచారణ నిర్వహించారు. ఆ రోజు ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనకాపల్లి నుంచి విశాఖ కేజీహెచ్‌కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం మృతి చెందింది. దీంతో గర్భస్థ శిశువుతోపాటు తల్లి మృతి చెందడంతో స్థానిక పీహెచ్‌సీలో వైద్యాధికారులు ఎల్.వి.ఎస్.ఎస్. ప్రసాదుపాత్రుడు, బి. ఈశ్వర్ సందీప్, ఇతర సిబ్బందిని విచారించారు. బిడ్డ మృతితో బాలింతరాలు డిప్రెషన్‌కు లోనైందని స్టాఫ్‌నర్స్ మానస వివరించారు. అనంతరం గ్రామానికి వెళ్లి మృతురాలు కుటుంబ సభ్యులను విచారించారు. ఈ సందర్భంగా డీఐవో మాట్లాడుతూ సమగ్రంగా విచారణ చేపట్టి, నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామన్నారు. తాటిపర్తి సచివాలయ ఏఎన్‌ఎం, ఎంహెల్‌హెచ్‌పీ శ్రావణి, కూర్మానాథపురం ఆశ కార్యకర్త, పీహెచ్‌ఎన్ ఇందిరను విచారించారు. ఇటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా తగు జాగ్రత్తలు వహించాలని ఆయన ఆదేశించారు. అనంతరం పీహెచ్‌సీలో ఆపరేషన్ థియేటర్, మందులిచ్చే గదిని, ల్యాబ్‌ను, వార్డును పరిశీలించారు.


