సీపీఐ జాతీయ సమితి సభ్యుడు జె.వి.సత్యనారాయణమూర్తి
అనకాపల్లి: అమరావతిలో విపరీతమైన దోపిడీ జరుగుతుందని, అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వం పోలీసులకు విచక్షణారహితంగా అధికారాలు ఇవ్వడంతో రాష్ట్రంలో పోలీసు పాలన కొనసాగుతోందని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు జె.వి.సత్యనారాయణమూర్తి విమర్శించారు. స్థానిక న్యూకాలనీ రోటరీ హాల్లో సోమవారం పార్టీ నాయకులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలపై చంద్రబాబు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించడం దుర్మార్గం అన్నారు. సాయి తేజ మృతి కేసే దీనికి ఉదాహరణ అన్నారు. రామ మందిరం నిర్మిస్తే దేశంలో ప్రజలు ప్రశాంతంగా ఉంటారని చెప్పి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ భక్తులిచ్చిన కోట్లాది రూపాయల విరాళాలు దోచుకుని హిందువుల మనోభావాలు దెబ్బతీసిందన్నారు. ఒకప్పుడు పవిత్రమైన తిరుపతి లడ్డూను పాచిపోయిన లడ్డూ ఇచ్చిన ప్రధాని మోదీ అని చెప్పిన పవన్ కళ్యాణ్ తనకు తాను గొప్ప సనాతని అని ప్రకటించుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయం అన్నారు. ఆగస్టు 6 నుంచి 14వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ దేశ వ్యాప్తంగా ప్రదర్శనలు, పాదయాత్ర జరుగుతున్న నేపథ్యంలో అనకాపల్లి జిల్లాలో కూడా ర్యాలీలు పాదయాత్రలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి, సహాయ కార్యదర్శులు దొరబాబు, అప్పలరాజు, కార్యవర్గ సభ్యులు వెంకటరమణ,గురు బాబు, ఫణీంద్ర, డిసిహెచ్.క్రాంతి, రాధాకృష్ణ, మండల కార్యదర్శులు వియ్యపు రాజు, తాకాసి వెంకటేశ్వర్లు, గొర్ల దేముడు బాబు తదితరులు పాల్గొన్నారు.


