మహారాణిపేట: వచ్చే నెల 1న ప్రారంభం కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేట్‌వేగా నిలవనుందని విశాఖ కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన సమీక్షలో విమానాశ్రయం ప్రారంభాన్ని పురస్కరించుకుని పది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాలని, పర్యాటకం, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు.
28 రహదారులతో అనుసంధానం
విశాఖ నుంచి విమానాశ్రయానికి 28 ప్రధాన రహదారులు (238 కి.మీ) అందుబాటులో ఉన్నాయని, అన్ని మార్గాల్లో సైనేజీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బ్రౌన్‌ఫీల్డ్, గ్రీన్‌ఫీల్డ్ రోడ్లను డిసెంబరు నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏడు ప్రాధాన్య రోడ్లలో నాలుగు పూర్తయ్యాయని, అడవివరం–శాంఠ్యాం రోడ్డుకు అటవీ అనుమతులు లభించాయని, జుత్తాడ రోడ్డు పనులు త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు.
20 ప్రత్యేక బస్సులు.. 9 లాంజ్‌లు
విమానాశ్రయానికి 20 ప్రత్యేక బస్సులను కేటాయించగా, ఇప్పటికే 9 అందుబాటులోకి వచ్చాయ ని తెలిపారు. గాజువాక, బీచ్ రోడ్ మార్గాల్లో ప్రత్యేక సర్వీసులు నడపడంతో పాటు నగరంలోని తొమ్మిది ప్రాంతాల్లో ప్రయాణికుల కోసం లాంజ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
వచ్చే నెల 1 ప్రారంభానికి కనెక్టివిటీ,రవాణా ఏర్పాట్లు వేగవంతం


