ఎస్.రాయవరం: అధికార బలంతో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు, పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త , మాజీ సర్పంచ్ అయిన వజ్రపు శంకర్రావు దౌర్జన్యంగా తన సొంతభూమిలో పశువుల షెడ్డుని కూలదోసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలు వజ్రపు లక్ష్మి సోమవారం అనకాపల్లి జిల్లా కలెక్టర్‌కు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సమస్యపై రాష్ట్ర మహిళా కమిషన్‌కు, సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. శంకర్రావు హోంమంత్రి ముఖ్య అనుచరుడు కావడంతో అధికారులు ఆయన దౌర్జన్యాలను నిలువరింపచేయకపోగా , ఇచ్చిన ఫిర్యాదుపై కూడా చర్యలు తీసుకోలేకపోతున్నారని బాధితురాలు వాపో యారు. పాడి పశువులను పెంచుకుంటూ కూలి చేసుకుని బతికే తమను ఇబ్బందులు పెట్టడం ఏమిటని ఆవేదన చెందారు. కొనుక్కున్న భూమిలో రూ.4 లక్షల వెచ్చించి షెడ్డు నిర్మాణం చేసుకుంటే కూలదోసి తమని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని చెప్పారు. జిల్లా అధికారులు విచారణ జరిపి తమకు న్యాయం చేయలాని పేర్కొన్నారు.


