మునగపాక : కొద్ది రోజులుగా వర్షాలు కురవకపోవడంతో పంట పొలాల సాగుపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేస్తున్నాయి. జూలై 20వ తేదీకి చేరుకుంటున్నా ఎండల తీవ్రత తగ్గడం లేదు.దీంతో అటు ప్రజలు,ఇటు రైతులు ఆవేదనకు గురవుతున్నారు. దీంతో నాగులాపల్లికి చెందిన గౌరీ పుత్రులు వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ఆదివారం కప్పాకప్పా నీలాలకు శ్రీకారం చుట్టారు. గౌరీ పుత్రులైన పొలమరశెట్టి నూకాలయ్య, శరగడం సత్యనారాయణ,దొడ్డి ఆదిబాబు,పొలమరశెట్టి జగన్,సురేష్,మళ్ల అప్పలనాయుడు, సంతోష్‌తో పాటు పలువురు రైతులు గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు.కప్పలను పట్టుకొని కర్రకు కట్టి ఊరేగింపు చేపట్టారు. కప్పాకప్పా నీలాలు అంటూ నినదించారు. వరుణ దేముడు కరుణ చూపించాలంటూ రైతులు అలాగే ప్రజలు కూడా వేడుకుంటున్నారు.


