చోడవరం : ఇటీవల కాలంలో దేవాలయాల్లో హుండీల చోరీలు యథేచ్ఛగా జరుగుతున్నారు. ఇప్పటికే మండలంలో పలు గ్రామాల్లో దేవాలయాల్లో జరిగిన హుండీ చోరీలు మరువక ముందే తాజాగా చోడవరం పట్టణంలో ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ చోరీ జరిగింది. చోడవరం–లక్ష్మీపురం రోడ్డులో పట్టణ శివారు ద్వారకానగర్ వద్ద ఉన్న అభయాంజనేయస్వామి ఆలయంలో హుండీ శనివారం అర్ధరాత్రి చోరీకి గురైంది. ఆలయంలో ఉన్న సీసీ కెమెరా ఆధారంగా ఆలయంలో హుండీ చోరీ జరిగినట్టు ఆలయ కమిటీ గుర్తించి పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలో నమోదైన వివరాలు ప్రకారం ఒక దొంగ ఆలయం ప్రధాన ఇనుప గేటు తాళాన్ని పగలు గొట్టి ఆలయంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న హుండీ తాళాన్ని పగలు గొట్టాడు. అందులో భక్తులు కానుక రూపంలో వేసిన డబ్బులన్నింటినీ తన జేబులో వేసుకొని హుండీ మొత్తం లూటీ చేసి అక్కడ నుంచి పరారయ్యాడు. ఉదయం లేచి సీసీ పుటేజీలను పరిశీలించిన ఆలయ కమిటీ ప్రతినిధులు వెంటనే చోడవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు రూ. 20వేలకు పైబడి నగదు చోరీకి గురై ఉంటుందని అంచనావేస్తున్నారు. ఇదిలావుండగా ఇటువంటి చిల్లర దొంగల ఆగడాలు ఇటీవల చోడవరం పరిసరాల్లో చాలా ఎక్కువయ్యాయి. వాస్తవానికి ఈ రూట్‌లో రాత్రి పూట పోలీసు గస్తీ కూడా ఉంటుంది. అయినప్పటికీ దర్జాగా చోరీ చేయడం గమనార్హం. ఇప్పటికై నా పోలీసు గస్తీని మరింత ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
సీసీ కెమెరాలో చిక్కిన చోరీ దృశ్యాలు


