అనకాపల్లి : విద్యాశాఖలో ఉపాధ్యాయుల విభజన జరగవలసి ఉందని, అల్లూరి సీతారామరాజు జిల్లాను జోన్ 1గా మార్చాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల అన్నారు. స్థానిక ఉప్పలపాటి చంద్రశేఖరరావు కల్యాణ మండపంలో ఆదివారం ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వై.శ్రీనివాస్ ఆధ్యక్షతన ఉమ్మడి విశాఖ జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రపతి ఉత్తర్వులు–2025 ఉపాధ్యాయుల విభజనపై ఆమె వివరించారు. ఉమ్మడి విశాఖలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1/70 చట్టం అమలులో ఉన్న కారణంగా గిరిజనేతర ఉపాధ్యాయులు విభజనలో అల్లూరి జిల్లాకు అలాట్ అయితే వారు అనకాపల్లి, విశాఖ జిల్లాలో రాబోయే ఖాళీల్లోకి తిరిగి వచ్చే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు కె.వేణుగోపాల్ మాట్లాడుతూ తెలంగాణలో జరిగిన ఉపాధ్యాయుల విభజన ప్రక్రియను వివరించి, అక్కడ ఏర్పడిన ఇబ్బందులను వాటిపై సంఘాల ప్రాతినిధ్యాలను వివరించారు. తెలంగాణ ఉద్యోగుల విభజనలో జరిగిన లోపాలు ఏపీ ఉద్యోగుల విభజనలో పునరావృతం కాకుండా చూడాలని ఆయన కోరారు. అనంతరం స్థానిక సమస్యలపై రాష్ట్ర అధ్యక్షురాలు మంజులకు వినతిపత్రం అందజేస్తున్న ఏపీటీఎఫ్ జిల్లా నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తమరాన త్రినాథ్, రాష్ట్ర పూర్వ కార్యదర్శి బి.వెంకటపతిరాజు, అనకాపల్లి, విశాఖ జిల్లాల నాయకులు కె.కె.ఎల్.ఎన్.ధర్మారావు, ఎస్.దుర్గాప్రసాద్, సీహెచ్.కరుణాకరరావు, టి.రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.


