క్లుప్తంగా
ఎంవీపీకాలనీ: భీమిలిలోని ఒన్ స్టాఫ్ సెంటర్ (వోఎస్‌సీ)లో వివిధ పోస్టుల భర్తీకి జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా సెంటర్ అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, పారా లీగల్ పర్సనల్, పారా మెడికల్ పర్సనల్, సైకో సోషల్ కౌన్సిలర్, ఆఫీస్ అసిస్టెంట్, మల్టీపర్పస్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డ్ వంటి మొత్తం 13 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 31వ తేదీలోగా ఎంవీపీ కాలనీ సెక్టార్–9లోని సంక్షేమ భవన్ కార్యాలయంలో అందజేయాలని అధికారులు కోరారు.
విశాఖలో మరో కరోనా కేసు నమోదు
మహారాణిపేట: నగరంలో తాజాగా మరో కరోనా కేసు వెలుగుచూసింది. దీంతో జిల్లాలో యాక్టివ్ కేసుల సంఖ్య రెండుకు చేరింది. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఓ 28 ఏళ్ల యువకుడు పెందుర్తి ప్రాంతంలో కూలి పనులు చేస్తూ నివాసం ఉంటున్నాడు. గత కొన్ని రోజులుగా మలేరియా జ్వరంతో బాధపడుతున్న అతడికి ఎంతకీ తగ్గకపోవడంతో కేజీహెచ్‌లో చేర్పించారు. అక్కడ వైద్యులు శాంపిల్స్ సేకరించి వైరాలజీ ల్యాబ్‌లో పరీక్షించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం ఆ యువకుడిని కేజీహెచ్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నామని, అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. చంద్రశేఖర్ నాయుడు పేర్కొన్నారు. ఇప్పటికే నగరంలోని అఫీషియల్ కాలనీకి చెందిన 33 ఏళ్ల యువకుడు కొవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే.


