అనకాపల్లి: దేశవ్యాప్తంగా తుపాలశాఖలో విధులు నిర్వహిస్తున్న జీడీఎస్ ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలని ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కార్యాలయం విజయవాడ వద్ద ఈనెల 14న భారీ ఎత్తున ధర్నా, ర్యాలీ నిర్వహించడం జరిగిందని, అక్కడ విషయాలను జిల్లాస్థాయి సమావేశంలో వివరించడం జరుగుతుందని అనకాపల్లి తపాలశాఖ డివిజన్ కార్యదర్శి డిఎస్‌ఆర్.ప్రసాద్ అన్నారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో తపాలశాఖ జీడీఎస్ ఉద్యోగులు, ది అనకాపల్లి పోస్టల్ ఎంప్లాయిస్ కో–ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిడెట్ నంబర్.బి–1952 జనరల్ బాడీ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జీడీఎస్‌లకు పూర్తిస్థాయి సామాజిక భద్రత, పెన్షన్ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందని, 8వ కేంద్ర వేతన సంఘం పరిధిలో జీడీఎస్‌లను చేర్చి న్యాయమైన వేతన ప్రయోజనాలు అందించాల్సి అవసరం ఉందన్నారు. పెరగుతున్న పనిభారం, లక్ష్యాల(టార్గెట్ల) పేరుతో జరుగుతున్న ఒత్తిడి, వేధింపులను నిలిపివేయాలన్నారు. వివిధ విభాగాల్లో ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేసి, ఉద్యోగులపై అదనపు భారం తగ్గించాల్సి బాధ్యత ఉన్నతస్థాయి అధికారులపై ఉందన్నారు. ఉద్యోగుల సమస్యలను ఏకపక్ష నిర్ణయాలతో కాకుండా, యూనియన్లతో చర్చించి పరిష్కరించాలని ఆయన కోరారు. కమలేష్ చంద్ర కమిటీ నివేదికను అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఆర్.వి,నాగరాజు, డీజీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు.


