సాక్షి, విశాఖపట్నం: ఎల్‌నినో ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఏపీఈపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతోందని విశాఖపట్నం సర్కిల్ ఎస్‌ఈ జి.శ్యాంబాబు తెలిపారు. సర్కిల్ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత విద్యుత్ డిమాండ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు అంతరాయం లేకుండా సరఫరా అందించేందుకు ప్రత్యేకంగా విశాఖ సర్కిల్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జూనియర్ ఇంజినీర్ ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ నడుస్తుందన్నారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడినా వెంటనే వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్ 1912కు లేదా విశాఖపట్నం కంట్రోల్ రూమ్ నంబర్ 0891–2718091కు సంప్రదించవచ్చన్నారు. ఎక్కడ ఎలాంటి విద్యుత్ సమస్య వచ్చినా.. కంట్రోల్ రూమ్‌కు కాల్ చేసిన వెంటనే నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.


