సీపీఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్రకార్యదర్శి బుగతా బంగార్రాజు డిమాండ్
రోలుగుంట: కె.అడ్డసరంలో వారసులు లేని భూమిని దీర్ఘకాలంగా సాగుచేసుకుంటున్న ఆదివాసీలకు పంచి, ఫోర్జరీ సంతకాలతో ధ్రువపత్రాలు పొంది వారసుడిగా చెప్పుకుంటున్న వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీపీఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శిఽ బుగతా బంగర్రాజులు డిమాండ్ చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆదివాసీలు చేపట్టిన రిలే దీక్షా శిబిరాన్ని సోమవారం ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కె.అడ్డసరం రెవెన్యూలో భూమి పంతులమ్మదని, ఈమెకు వారసులు లేరన్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఫోర్జరీ సంతకాలతో నకిలీ ధ్రువపత్రాలు పొంది తానే వారసుడిగా చెప్పుకుంటున్న చంద్రశేఖర్‌పై నర్సీపట్నం, యలమంచిలిలో కేసులు కూడా ఉన్నాయన్నారు. ఈ భూమికి చంద్రశేఖర్‌కి సంబంధం లేదని ఆర్డీవో చెప్పడంతో జేసీ కోర్టులో కేసు పెండింగు ఉందన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకొని సమగ్ర విచారణ చేసి సాగులో ఉన్న ఆదివాసీల పేర్లు నంబర్ –3 అడంగల్‌లో నమోదు చేయాలన్నారు. తహసీల్దార్ డిజిటల్ సైన్ తొలగిస్తేనే దీక్షలు విరమిస్తామని 48 మంది ఆదివాసీలు తెలిపారు. లేకుంటే జిల్లాలో అన్ని మండలాల్లో విస్తరింపజేస్తామని ఆదివాసీ సంఘ నాయకులు కోసూరు రాజు, రావి నూకరాజు హెచ్చరించారు.


