చీడికాడ: సోలార్ ప్లాంట్ ఏర్పాటు పేరుతో నాలుగు గ్రామాల రైతుల నుంచి బలవంతపు భూ సేకరణ ఆపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వెంకన్న, జీఎంపీఎస్ జిల్లా చైర్మన్ గంటా శ్రీరాం, సీఐటీయూ మండల కార్యదర్శి ఆర్.దేముడునాయుడు డిమాండ్ చేశారు. శుక్రవారం బాధిత గ్రామాలైన బైలపూడి, చినగోగాడ, జి.కొత్తపల్లి, అడవి అగ్రహారం గ్రామాల రైతులతో బైలపూడిలో మహాధర్నా నిర్వహించారు. వీరికి మద్దతుగా పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ నాలుగు గ్రామాల్లో భూ సేకరణను వ్యతిరేకిస్తూ అధికారులు జారీ చేసిన నోటీసులకు సమాధానం చెప్పినా సరే తహసీల్దార్ బెదిరింపులకు దిగడం దారుణమన్నారు. అవి ప్రభుత్వ భూములని పోలీసుల సహకారంతో సేకరిస్తామని బెదిరించడం తగదన్నారు. నాలుగు గ్రామాల్లో 262 ఎకరాలకు 40 ఏళ్ల క్రితమే సాగు హక్కు పత్రాలు మంజూరు చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏపీఈపీడీసీఎల్ ద్వారా 57.97 మెగావాట్ల సోలార్ ప్లాంట్ నిర్మంచనున్నట్లు ప్రకటించిందన్నారు. ఈ భూముల్లో వందలాది మంది రైతులు పామాయిల్, నువ్వులు, వేరుశనగ, తదితర పంటలతో తమ కుటుంబాలను పోషించుకుంటున్నాయని తెలిపారు. ఇప్పటికై నా ప్రభుత్వ యంత్రాంగం రైతులకు ఇష్టం లేకుండా భూసేకరణ పేరిట ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. గ్రామసభల్లోనే భూములు ఇవ్వబోమని చెప్పినా పట్టించుకోకుండా సేకరణ పేరిట ముందుకు వెళ్లే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. ఎ.అగ్రహారం మాజీ సర్పంచ్ సలాది గంగశేషు, మాజీ ఎంపీపీ కొల్లి అప్పలనాయుడు, గంటా మత్స్యరాజు, జాజిమొగ్గల రమేష్, సిహెచ్ శ్రీను, సన్యాసిరావు, సిరికి రాము, అప్పలనాయుడు, మహాలక్ష్మి, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.


