రూ.350 కోట్ల భూ వివాదంలో బదిలీ అయిన సీఐకి కీలక స్టేషన్ బాధ్యతలు
సొంత పార్టీ ఎమ్మెల్యే సిఫారసే కారణం?
తాత్కాలికం పేరిట
గాజువాక స్టేషన్ అప్పగింత
కొనసాగుతారంటూ పోలీసుశాఖలో చర్చ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
రాజకీయాల్లో ‘మాట’ వేరు.. ‘వ్యవహారాలు’ వేరు అని విశాఖ పోలీసుశాఖలో జరుగుతున్న తాజా బదిలీలు నిరూపిస్తున్నాయి. ఏకంగా రూ. 350 కోట్ల విలువైన భూవివాదంలో తలదూర్చి, నిబంధనలను తుంగలో తొక్కారనే ఆరోపణలతో లూప్‌లైన్‌లోకి వెళ్లిన ఒక సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌కు.. ఇప్పుడు ఏకంగా అత్యంత కీలకమైన, క్రేజీ పోస్టింగ్ దక్కడం విశాఖపట్నంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహానికి గురై, పోస్టింగ్ లేకుండా ఆరు నెలలుగా వెయిటింగ్‌లో ఉన్న సదరు అధికారికి.. ఇప్పుడు అదే జనసేన పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే సిఫారసుతోనే ‘గాజువాక’ లా అండ్ ఆర్డర్ సీఐగా పీఠం దక్కడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
రూ. 350 కోట్ల భూమి.. తెరవెనుక అసలు కథ!
ఈ వివాదానికి మూలం అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం, అచ్యుతాపురం మండలం దుప్పితూరు గ్రామంలో ఉంది. బోగాపురం రెవెన్యూ పరిధిలోని 40/2, 30,31,39,461/2,5,7, 477, 488, 490/1, 490/2, 52,54,56,60/2, 103, 112, 113, 114/3 సర్వే నెంబర్లలోని దాదాపు 35 ఎకరాల ప్రైమ్ ల్యాండ్ (విలువ సుమారు రూ.350 కోట్లు)పై 1993 నుంచి పీఆర్‌ఎస్ నాయుడు, పైలా వెంకటస్వామి మధ్య సివిల్ వివాదం నడుస్తోంది. అయితే, కోర్టు తుది తీర్పు పీఆర్‌ఎస్ నాయుడుకు అనుకూలంగా రావడంతో, ఇరువర్గాలు ఒక అవగాహనకు వచ్చి సమస్యను పరిష్కరించుకున్నాయి. అయితే, ఈ వ్యవహారంలోనే అసలు ట్విస్ట్ మొదలైంది. ఈ భూవివాదాన్ని సెటిల్ చేసేందుకు సదరు యజమాని నుంచి ఒక ప్రజాప్రతినిధి భారీగా డిమాండ్ చేసి, రూ. 50 లక్షలు అడ్వాన్స్‌గా కూడా తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. తనతో సంబంధం లేకుండా ఇరుపార్టీలు రాజీ పడటాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ ప్రజాప్రతినిధి.. స్థానిక అధికారులపై ఒత్తిడి తెచ్చారు. సివిల్ వివాదాన్ని కాస్తా క్రిమినల్ కేసుగా మార్చేందుకు అప్పటి అచ్యుతాపురం సీఐ నమ్మి గణేష్, స్థానిక తహసీల్దార్ చేతులు కలిపారనే విమర్శలు వచ్చాయి. కోర్టు ఆర్డర్స్ పక్కనబెట్టి, అక్కడ 145 ప్రొసీడింగ్స్ జారీ చేయడం, విద్యుత్ కనెక్షన్ ఇవ్వకుండా అడ్డుకోవడంలో సదరు సీఐ చక్రం తిప్పారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
పవన్ ఎంట్రీ.. బదిలీ వేటు!
ఈ వందల కోట్ల భూదందా వ్యవహారం కాస్తా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సన్నిహితుడి సురేష్ ద్వారా నేరుగా కేబినెట్ భేటీ వరకు వెళ్లింది. కూటమి ప్రభుత్వంలో అధికారులు, నేతలు భూవివాదాల్లో తలదూర్చడాన్ని పవన్ తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో అప్పట్లో అచ్యుతాపురం సీఐ గణేష్‌తో పాటు తహసీల్దార్‌పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. గత నవంబర్ నుంచి సదరు సీఐకి ఎలాంటి పోస్టింగూ ఇవ్వకుండా పక్కన పెట్టారు.
అధినేత నో చెప్పినా.. ఎమ్మెల్యే ‘ఎస్’ అన్నారు!
ట్విస్ట్ ఏమిటంటే ఏ అధికారి ప్రవర్తనపై పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారో.. అదే అధికారికి ఇప్పుడు జనసేన పార్టీకే చెందిన ఒక విశాఖ ఎమ్మెల్యే గట్టిగా సిఫారసు చేసి మరీ గాజువాక లాంటి కీలకమైన స్టేషన్‌ను కట్టబెట్టడం అందరినీ ము క్కున వేలేసుకునేలా చేస్తోంది. ప్రస్తుతానికి ‘తాత్కాలిక అటాచ్‌మెంట్’ పేరిట విశాఖ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ.. లోపాయికారీ ఒప్పందాల ప్రకారం ఆయనే అక్కడ శాశ్వతంగా కొనసాగుతారనే ప్రచారం పోలీసు వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
అచ్యుతాపురం నుంచి ఊస్టింగ్.. ఆరు నెలల్లోనే గాజువాక ఎంట్రీ
పార్టీపై పట్టు కోల్పోతున్నారా?
ఈ పరిణామాలు జనసేన అంతర్గత వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తున్నాయి. అధినేత పవన్ కళ్యాణ్‌కు సొంత నేతలపై, పార్టీ వ్యవహారాలపై నియంత్రణ లోపించిందా? అనే అనుమానాలను స్వయంగా జనసైనికులే వ్యక్తం చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం నాగబాబు సమక్షంలో జరిగిన ఓ సమావేశంలో జీవీఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ భర్త మాట్లాడుతూ తమకు కనీస గౌరవం దక్కడం లేదని, తనను మార్చేందుకు కూడా స్థానిక నేతలు కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం కూడా పవన్ దాకా వెళ్లనీయలేదనే ప్రచారం జరిగింది. పార్టీ కోసం మొదటి నుంచి జెండాలు మోసిన అభిమానులను, నేతలను పక్కనబెట్టి, నామినేటెడ్ పదవుల దగ్గర నుంచి పోలీసు పోస్టింగుల వరకు కేవలం కొందరు స్థానిక ప్రజాప్రతినిధుల మాటే చెల్లుబాటవుతుండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. స్వయంగా అధినేత వద్దన్న అధికారికి పార్టీ ఎమ్మెల్యే అండదండలతో ‘గాజువాక’ లాంటి పోస్టింగ్ దక్కడం.. కూటమి ప్రభుత్వంలో అంతర్గతంగా నడుస్తున్న అధికార పంపిణీకి, తెరవెనుక సర్దుబాట్లకు అద్దం పడుతోంది. ఈ వ్యవహారంపై ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.


