పల్లె రోడ్లలో... ఓవర్‌లోడ్‌ | - | Sakshi
Sakshi News home page

పల్లె రోడ్లలో... ఓవర్‌లోడ్‌

May 1 2026 5:33 AM | Updated on May 1 2026 5:33 AM

● అడ్డదారిలో రాకపోకలకు అడ్డుకట్ట ఏదీ.. ● మొక్కుబడిగా కేసులు ● దెబ్బతింటున్న రహదారులు ● ప్రమాదాలపై జనం ఆందోళన

నక్కపల్లి: జాతీయ రహదారిపై టోల్‌ఫీజును ఎగ్గొట్టేందుకు పరిమితికి మించిన లోడుతో లారీలు అడ్డదారిలో రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే జాతీయ రహదారిపై కాకుండా కేసుల నుంచి తప్పించుకునేందుకు పల్లెరోడ్లో ప్రయాణించడం వల్ల కేవలం గ్రామ అవసరాల కోసం వేసిన రోడ్లు కొద్దిరోజులకే శిథిలావస్థకు చేరుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అడ్డదారిలో ప్రయాణిస్తున్న లారీలు కంటపడితే పట్టుకుని పోలీసుల వేలాది రూపాయల పెనాల్టీ విధిస్తున్నప్పటికీ ఈ అడ్డదారి రాకపోకలకు మాత్రం అడ్డుకట్టపడటం లేదు. వివరాల్లోకి వెళ్తే.. పరవాడలో ఉన్న ఎన్‌టీపీసీనుంచి ఫ్లైయాష్‌ను లోడ్‌ చేసుకుని భారీ ట్రిప్పర్లు కాకినాడ వెళ్లాల్సి ఉంటుంది. సాధారణంగా ఒక ట్రిప్పర్‌పై 30 నుంచి 40 టన్నుల వరకు లోడ్‌ చేసేందుకు అనుమతి ఉంది. కానీ ఈ ట్రిప్పర్లలో రెట్టింపు అంటే సుమారు 70 టన్నులకు పైగ ఫ్లైయాష్‌ను లోడ్‌ చేస్తున్నారు. పరవాడ నుంచి కాకినాడ జాతీయ రహదారిమీదుగా వెళ్లాలి. ఇలా వెళితే వేంపాడు టోల్‌ గేట్‌ వద్ద ఈ భారీ వాహనాలను తనిఖీ చేసి, సామర్థ్యానికి మించి లోడ్‌ చేస్తే రూ.8వేల వరకు ఓవర్‌లోడింగ్‌ చార్జీ విధిస్తున్నారు. ఈ చార్జీ నుంచి తప్పించుకునేందుకు డ్రైవర్లు, లారీ యజమానులు అడ్డదారిలో రాకపోకలు సాగిస్తున్నారు. నక్కపల్లి వరకు వచ్చి అక్కడ నుంచి ఉపమాక , చందనాడ, అమలాపురం మీదుగా స్టీల్‌ప్లాంట్‌ కోసం కొత్తగా నిర్మిస్తున్న రోడ్డులో రాకపోకలు సాగించి వేంపాడు వద్ద జాతీయరహదారిపైకి చేరుకుంటున్నారు. ఇలా అయితే టోల్‌ ప్లాజా నుంచి తప్పించుకోవచ్చు. ఇలా ప్రయాణించడం వల్ల ఉపమాక, చందనాడ, అమలాపురం, వేంపాడు గ్రామాల్లో ప్రజల అవసరాల కోసం పంచాయతీరాజ్‌శాఖ ఏర్పాటు చేసిన రోడ్లు శిథిలమవుతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరుకు రోడ్లలో భారీ వాహనాలు రాకపోకలు సాగించడం వల్ల భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. నిత్యం 50 నుంచి 80 వరకు భారీ ట్రిప్పర్లు ఈ అడ్డదారిలో ప్రయాణిస్తున్నాయి. పోలీసుల కంటపడితే అడ్డదారిలో రాకపోకలు సాగించే సమయంలో పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. వీటిని రవాణా శాఖ అధికారులకు సిఫార్సు చేయడంతో వారు ఒక్కో లారీకి రూ.60 వేల నుంచి 85 వేల వరకు పెనాల్టీ విధిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో నక్కపల్లి పరిధిలో పోలీసులు 11 లారీలను పట్టుకుని రవాణా శాఖ అధికారులకు చర్యల నిమిత్తం పంపిస్తే వారు రూ.8లక్షలు పెనాల్టీ విధించారు. అయినప్పటికీ ఈ అడ్డదారిలో రాకపోకలు ఆగడంలేదు. పగటిపూట అయితే పోలీసులు పట్టుకుంటున్నారని రాత్రిపూట అడ్డదారిలో ఈ లారీలను తీసుకెళ్తున్నారని ఆయా గ్రామాల వారు చెబుతున్నారు. ఇరుకు రోడ్లలో భారీ వాహనాలు తమ ఇళ్ల ముందు నుంచి వెళ్తుంటే కంటిమీద కునుకు ఉండడం లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న లారీ ఇరుకు రోడ్లలో ఎక్కడైనా బోల్తాపడితే ఇక అంతే సంగతులు. పెనాల్టీ ఒక్కటే కాకుండా వాహనాన్ని సీజ్‌ చేసి, డ్రైవర్లపై కేసులు నమోదు చేసి కోర్టుకు తరలించాలని, కనీసం నెలరోజులైనా వాహనాన్ని విడిచిపెట్టకుండా ఉంటేనే తప్ప ఓవర్‌లోడ్‌ లారీల రాకపోకలకు అడ్డుకట్ట వేయడం కష్టమని పలువురు అంటున్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు సైతం కేసులు నమోదు చేయాల్సి ఉంది. కానీ వారు పట్టించుకోవడం లేదు. టోల్‌గేట్‌ వేబ్రిడ్జి వద్ద తనిఖీ చేస్తుండడంతో తక్కువ బరువు చూపించేందుకు కొన్ని ట్రిప్పర్ల డ్రైవర్లు రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ ఫ్లైయాష్‌ను అన్‌లోడ్‌ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల జాతీయ రహదారిపై రాకపోకలు సాగించేవారి కళ్లల్లో ఈ ఫ్లైయాష్‌ పడి ఇబ్బంది పడుతున్నారు. ఈ ఓవర్‌లోడ్‌ లారీలపై సంబంధిత శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకుని అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.

బండరాళ్ల లోడు లారీలదే అదే పరిస్థితి..

కాకినాడ జిల్లా రౌతులపూడి నుంచి రాంబిల్లి ఎన్‌ఈవోబీకి బండరాళ్ల లోడుతో వెళ్లే లారీలదీ అదే పరిస్థితి. ఈలారీల్లో కూడా సామర్థ్యానికి మించి పెద్ద పెద్ద బండరాళ్లను లోడ్‌ చేసి రాంబిల్లి తరలిస్తున్నారు. వీరు కూడా ఇదే అడ్డదారిని ఎంచుకున్నారు. వీటిపై కూడా పోలీసులు దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ఓవర్‌లోడుతో వెళ్లే

నిబంధనలకు విరుద్ధంగా ఓవర్‌లోడుతో వెళ్తే పట్టుకుని కేసులు నమోదు చేస్తాం. టోల్‌ ఫీజు తప్పించుకునేందుకు అడ్డదారిలో గ్రామాల మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. వారం వ్యవధిలో 10 లారీలను పట్టుకున్నాం. జాతీయరహదారిపై నిరంతర నిఘా ఏర్పాటు చేస్తాం. జాతీయ రహదారి మీదుగా కాకుండా ఉపమాక, చందనాడ, వేంపాడు తదితర గ్రామాల మీదుగా వెళ్తే వదిలే ప్రసక్తే లేదు.

–మురళి, సీఐ నక్కపల్లి

Advertisement
 
Advertisement
Advertisement