కన్నీళ్లే
దారుణంగా జలాశయాలు కదలని పూడికతీత, కాలువల మరమ్మతుల పనులు
● జంగిల్ క్లియరెన్స్ చేపట్టక అధ్వానంగా సాగునీటి కాలువలు
● దెబ్బతిన్న గేట్లు.. ధ్వంసమైన వాటర్ ఫ్లో రోప్‌లు
● లీకులతో వేలాది క్యూసెక్కుల నీరు వృథా
● అధ్వానంగా సాగునీటి కాలువలు
● ప్రాజెక్టులపై చంద్రబాబు సర్కారు తీవ్ర నిర్లక్ష్యం
అనకాపల్లి జిల్లాలో ఒక భారీ నీటిపారుదల ప్రాజెక్టు(తాండవ), మూడు మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులు(రైవాడ, పెద్దేరు, కోనాం), 2,880 చిన్న నీటి పారుదల ప్రాజెక్టులు (చెరువులు,గ్రోయిన్లు, చెక్ డ్యాములు) ఉన్నాయి. వీటి పరిధిలో 3,05,993 ఎకరాల ఆయకట్టు ఉంది. తాండవ పరిధిలో 32,689 ఎకరాలు, మధ్య తరహా నీటి ప్రాజెక్టులు రైవాడ, పెద్దేరు, కోనాం పరిధిలో 42,725 ఎకరాలు, 2,880 చిన్న తరహా నీటిపారుదల ప్రాజెక్టుల కింద 2,30,579 ఎకరాల ఆయకట్టు ఉంది.
సాక్షి, అనకాపల్లి: రానున్న ఖరీఫ్ సీజన్‌లోనైనా తమ భూముల్లో పంటలు బాగా పండాలన్న రైతుల ఆశలకు ప్రభుత్వ నిర్లక్ష్యం గండికొడుతోంది. జిల్లాలో జలాశయాల పరిస్థితి దారుణంగా ఉంది. దీంతో ఈ ఏడాది కూడా సాగు నీటి కష్టాలు తప్పేలా లేకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో ఉన్న ఒక మేజర్, మూడు మధ్యతరహా, 2,880 చిన్న నీటి పారుదల ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో దాదాపు 3,05,993 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. రిజర్వాయర్ల ఆధునికీకరణ, మరమ్మతులతో పాటు సాగు నీటి కాలువల్లో పూడికతీత పనుల్లో ఎక్కడా కదలిక లేదు. రానున్న ఖరీఫ్ సీజన్‌లోనైనా రిజర్వాయర్ల పరిధిలో ఉన్న ఆయకట్టు శివారు భూముల వరకు సాగు నీరు అందాలంటే..ఈ వేసవిలోనే రిజర్వాయర్ గేట్లకు, దెబ్బతిన్న చెక్‌డ్యామ్‌లకు మరమ్మతులు, సాగునీటి కాలువల్లో పూడిక తీత, జంగిల్ క్లియరెన్స్ పనులను పూర్తిచేయా లి. వేసవి ముగిసి వర్షా కాలం వచ్చిందంటే పనులు చేసే అవకాశం ఉండదు.
చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత రెండు ఖరీఫ్ సీజన్లు ముగిశాయి. అయినా ప్రభుత్వం జలాశయాలపై కన్నెత్తికూడా చూడకపోవడంతో జిల్లాలో రిజర్వాయర్ల ఆధునికీకరణ, సాగునీటి కాలువల్లో పూడికతీత పనులు జరగక గేట్లు, చెక్‌డ్యామ్‌లు దెబ్బతిని నిత్యం వందలాది క్యూసెక్కుల నీరు వృథాగా బయటకు పోతోంది. సాగు నీటి కాలువలు పిచ్చిమొక్కలతో నిండిపోయా యి. పూడికతీత పనులు చేపట్టకపోవడంతో నీరు విడుదల సమయంలో ఇబ్బందులు ఎదురవు తున్నాయి. శివారు భూములకు సాగునీరు సక్రమంగా అందడం లేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభు త్వం ఈ ప్రాజెక్టుల ఆధునికీకరణ, మరమ్మతులకు నిధులను మంజూరు చేసింది. కొన్నింటి పను లు కూడా ప్రారంభమయ్యాయి. మరికొన్నింటికి టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాటిలో కొన్నింటిని రద్దు చేయడమే కాకుండా..మరికొన్నింటిలో టెండర్‌లను కూడా మార్చివేసింది. నాతవరం మండలంలో తాండవ సాగునీ కాలువలో పూడిక తీతపనులు, ఆధునికీకరణ పనులను చేపట్టలేదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టి 23 నెలలు పూర్తి కావస్తున్నా.. ప్రాజెక్టుల విషయంలో మొద్దు నిద్ర వీడలేదు. ఇప్పటికీ జలాశయాల పరిధిలో కాలువల్లో పూడికతీత, మరమ్మతు పనులకు నిధులు కేటాయించలేదు. గత ప్రభుత్వంలో మంజూరైన పనులను కొనసాగించకుండా ఈ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గత ఏడాది వర్షాకాలంతో పాటు, నవంబరు, డిసెంబరు నెలల్లో కురిసిన వర్షాలకు ఈ జలశయాల్లో నీరు ఎక్కువగా చేరింది. అయితే, లీకుల కారణంగా చాలా వరకూ వృథాగా పోయింది. రానున్న ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం ఈ జలాశయాలపై దృష్టి పెట్టాలని రైతులు వేడుకుంటున్నారు.
3,05,993 ఎకరాల ఆయకట్టు


