అచ్యుతాపురం రూరల్: మండల కేంద్రం అచ్యుతాపురంలోని ఇందిరమ్మ కాలనీకి ఆనుకుని ఉన్న చెరువు స్థలంపై కొందరు కబ్జాదారుల కన్నుపడింది. ఆక్రమించి ఇంటిని నిర్మించేందుకు ఆదివారం పొక్లెయిన్‌తో గోతులు తీస్తుండగా స్థానిక యువకులు అడ్డుకున్నారు. గతంలో ఇదే స్థలంలో తుప్పలు తొలగించినప్పుడు రెవెన్యూ అధికారులు స్పందించి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఆదివారం సెలవు రోజు కావడంతో తమకు అడ్డే ఉండదని భావించిన ఆక్రమణదారులు భవనం నిర్మాణానికి 12 సెంట్ల స్థలంలో గోతులు తీశారు. గమనించిన స్థానిక యువకులు అడ్డుకున్నారు. ఈ స్థలంలో ఉన్న హెచ్చరిక బోర్డును తొలగించి ఎందుకు గోతులు తీస్తున్నారని ప్రశ్నించారు. దీంతో పొక్లెయిన్ ఆపరేటర్ పనులు నిలిపివేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. చెరువును కాపాడాల్సిన అధికారులు పట్టించు కోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారని, గతంలో ఈ ప్రాంతాన్ని చదును చేసిన వారిపై చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేదికాదని తెలిపారు. అధికారులు స్పందించి చెరువు ఆక్రమణకు గురికాకుండా చూడాలని కోరారు. అచ్యుతాపురం పరిసర ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో అక్రమార్కులు గెడ్డలు, చెరువులు అన్న తారతమ్యం లేకుండా కనబడిన స్థలాలన్నింటినీ కబ్జా చేస్తున్నారు. స్థానిక కూటమి నాయకుల అండదండలతోనే చెరువు భూమి కబ్జాకు గురవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.


