వైఎస్సార్‌ హయాంలోనే పారిశ్రామికాభివృద్ధికి బీజం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ హయాంలోనే పారిశ్రామికాభివృద్ధికి బీజం

Mar 27 2026 8:46 AM | Updated on Mar 27 2026 8:46 AM

30 ఏళ్లు పాలించి ఒక్క పరిశ్రమా

తీసుకురాలేదు

జూమ్‌ మీటింగ్‌తో స్టీల్‌ ప్లాంట్‌ వస్తుందా?

టీడీపీ నాయకుల ప్రకటనపై

వైఎస్సార్‌సీపీ ఆగ్రహం

నక్కపల్లి: మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే పాయకరావుపేట నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధికి బీజం పడిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిశీలకుడు వీసం రామకృష్ణ తెలిపారు. గురువారం ఆయన నక్కపల్లిలో మాట్లాడుతూ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు ఘనత ముమ్మాటికీ వైఎస్సార్‌సీపీదేనన్నారు. దీనిపై తాము తప్పుడు ప్రచారం చేస్తున్నామని కొంతమంది టీడీపీ నాయకులు వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. పాయకరావుపేట నియోజవకర్గం టీడీపీకి కంచుకోటగా ఉండేదన్నారు. 30 ఏళ్లపాటు 1983 నుంచి 2009 వరకు, మళ్లీ 2014 – 19 వరకు టీడీపీ ఎమ్మెల్యేలే ఇక్కడ ప్రాతినిధ్యం వహించారన్నారు. ఈ కాలంలో నియోజకవర్గంలో ఒక్క పరిశ్రమా తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. చివరికి విద్యార్థుల ఉన్నత విద్య కోసం డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయలేని దుస్థితిలో ఆనాటి టీడీపీ ఎమ్మెల్యేలు పనిచేశారన్నారు. ఈ ప్రాంత రైతులకు రావాల్సిన తాండవ జలాలను సైతం విడుదల చేయించలేకపోయారని విమర్శించారు. 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి దృష్టికి ఈ ప్రాంత కరువు సమస్యలు తీసుకెళ్లడంతో ఆయన స్పందించి నక్కపల్లిలో హెటెరో డ్రగ్స్‌, పాయకరావుపేటలో దక్కన్‌ కంపెనీలను ఏర్పాటు చేయించారన్నారు. ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ బహిరంగ వేదికపై చెప్పారన్నారు. విశాఖ – చైన్నె ఇండస్ట్రియల్‌ కారిడార్‌, పరవాడలో ఫార్మాసిటీ, అచ్యుతాపురంలో సెజ్‌లు ఏర్పాటు చేసిన ఘనత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిదేనన్నారు. నియోజకవర్గానికి 35 క్యూసెక్కుల నీటిని విడుదల చేయించారన్నారు. నక్కపల్లి మండలంలో ఎస్‌ఈజెడ్‌ ఏర్పాటు ప్రతిపాదనలను తీసుకొస్తే భూములు కోసం వచ్చే వారిని చెట్లకు కట్టి కొట్టాలని చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారన్నారు.

జగన్‌ హయాంలోనే స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సుముఖత..

దావోస్‌లో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఈవో ఆదిత్య మిట్టల్‌ను కోరగా, నక్కపల్లి మండలంలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు భూములను మిట్టల్‌ ప్రతినిధుల బృందం పరిశీలించి వెళ్లిందని వీసం తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఆయన చూపించారు. జూమ్‌ కాల్‌లో స్టీల్‌ ప్లాంట్‌ తెచ్చేశానని లోకేష్‌ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జూమ్‌ సమావేశంలోనే రూ.లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురాగలరా? అని ఎద్దేవా చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ భూమి పూజా కార్యక్రమంలో నిర్వాసితులను కనీసం గౌరవించే ప్రయత్నం చేయలేదన్నారు. రైతుల త్యాగం వల్లే ఈ రోజు స్టీల్‌ ప్లాంట్‌ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారన్నారు. వీసీఐసీఆర్‌లో నక్కపల్లిని క్లస్టర్‌గా చేసిన ఘతన మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిదేనన్నారు. నక్కపల్లి మండలంలో సేకరించిన భూముల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.1100 కోట్లు కేటాయించారన్నారు. నక్కపల్లి ఆస్పత్రిని 50 పడకల స్థాయికి పెంచారన్నారు. ఎక్కడ నుంచో వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కంబాల జోగులుపై విమర్శలు చేస్తున్నారని, ప్రస్తుత ఎమ్మెల్యే, హోం మంత్రి కూడా స్థానికేతరాలన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన బుద్ధి చెప్తామన్నారు. కంబాల జోగులను విమర్శించే అర్హత టీడీపీ చోటా నాయకులకు లేదన్నారు. సమావేశంలో వైస్‌ ఎంపీపీ వెలగా ఈశ్వరరావు, ఎంపీటీసీ గొర్ల గోవిందరాజు, సర్పంచ్‌ తళ్ల భార్గవ్‌, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు ఎల్లేటి సత్యనారాయణ, స్టూడెంట్‌ విభాగం అధ్యక్షుడు యలమంచిలి చందు, మాజీ ఎంపీటీసీ పిక్కి తాతీలు, వార్డు సభ్యులు పిక్కి అప్పలరాజు, నాయకులు వంకా కృష్ణ, దమ్ము రమణ, ఎస్‌ చిన్నా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement