తుమ్మపాల: ఈవీఎం గొడౌన్ వద్ద సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని జేసీ శౌర్యమాన్ పటేల్ ఆదేశించారు. ఎస్పీ కార్యాలయం వద్ద ఉన్న ఈవీఎం గొడౌన్‌ను గురువారం జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఆయన తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరును, ప్రధాన ద్వారానికి ఉన్న సీళ్లను పరిశీలించారు. తాళాలు తీయించి గొడౌన్ లోపల కూడా తనిఖీ చేశారు. అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతా ప్రమాణాలపై అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. తనిఖీ క్రమంలో లాగ్‌బుక్‌లో సంతకం చేశారు. భద్రతా ప్రమాణాలు, లాగ్‌బుక్ నిర్వహణ ఇతర అంశాలపై నాయకులతో మాట్లాడారు. భద్రపరిచిన ఈవీఎంల స్థితిగతులను ఎన్నికల విభాగం అధికారులు జేసీకి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఆయిషా, కలెక్టరేట్ ఏవో విజయ్‌కుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధులు బి.శ్రీనివాసరావు, వి.రమేష్, మీసాల సుబ్బన్న, కె.హరినాథ్‌బాబు, స్థానిక రెవెన్యూ, ఎలక్షన్ సెల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
బూత్ లెవల్ ఏజెంట్ల వివరాలు పంపండి
●గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ బూత్‌కు ఏజెంట్‌ను నియమించి వివరాలను అందించాలని జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు కోరారు. ఈవీఎం గొడౌన్ తనిఖీ అనంతరం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల జాబితా నవీకరణ ప్రక్రియపై ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటర్ల చేర్పులు, తొలగింపులు, సవరణలు విషయంలో బూత్ లెవల్ అధికారులతో సమన్వయంతో పని చేయాలన్నారు. ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ఓటర్ల జాబితా తయారీలో సహకరించాలని కోరారు.


