సీతారామం | - | Sakshi
Sakshi News home page

సీతారామం

Mar 28 2026 7:33 AM | Updated on Mar 28 2026 7:33 AM

● పెదబోదిగల్లంలో భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు

లోకాభిరామం...
నేత్ర పర్వంగా సీతారాముల కల్యాణం
గ్రామగ్రామాన రామనామం ప్రతిధ్వనించింది...మామిడాకుల తోరణాలు మెరిసిమురిసిపోయాయి.. మందిరాలు, వీధులు కల్యాణ మండపాలుగా మారిపోయాయి... సిగ్గుమొగ్గలైన సీతమ్మ... చిరు మందహాసంతో రామయ్య ఆసీనులయ్యేవేళ ఆయా ప్రాంతాలన్నీ పరమ ధామాల్లా శోభిల్లాయి.. శ్రీరాముడు సీతారాముడిగా మారుతున్న వేళ.. సకల సుగుణాల కలబోత సీతమ్మ.. రామయ్య చెంతన చేరిన వేళ... మంగళవాయిద్యాలు కల్యాణరాగం ఆలపించాయి... వేద మంత్రాలు మిన్నంటాయి.. జై శ్రీరామ్‌.. జైజై సీతారామ్‌ అన్న జయజయ ధ్వానాల మధ్య సీతారాముల కల్యాణం అంగరంగవైభవంగా జరిగింది. ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న రామాలయంలో స్వామివారి కల్యాణాన్ని అర్చక స్వాములు ప్రసాదాచార్యులు, శేషాచార్యులు ఘనంగా నిర్వహించారు. మరో భద్రాద్రిగా పేరుగాంచిన మునగపాక మండలం అరబుపాలెంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి.
కె.కోటపాడు మండలం చిరికిపాలెంలో పిండివంటలతో సీతమ్మకు సారె సమర్పించారు. చోడవరం, నర్సీపట్నం తదితర మండలాల్లో సీతారామ కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కనులారా తిలకించిన భక్తులు పరవశించిపోయారు. – సాక్షి, న్యూస్‌ నెట్‌వర్క్‌
సింహగిరిపై రాములోరి వేడుక

ఘనంగా కల్యాణోత్సవం

సింహాచలం : సింహగిరిపై ఉన్న పురాతన రామాలయంలో శుక్రవారం శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ కల్యాణ వేడుకను కనులారా తిలకించి భక్తిపారవశ్యంలో మునిగితేలారు. సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామివారి ఉత్సవమూర్తుల సమక్షంలో విష్వక్సేనపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలను దేవస్థానం స్థానాచార్యులు టీపీ రాజగోపాల్‌, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు, అర్చకులు గిరి, కుమార్‌, అప్పాజి తదితరులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు కల్యాణ అక్షింతలు, ప్రసాదాలు పంపిణీ చేశారు. దేవస్థానం ఈవో జె.వెంకటరావు, ఏఈవోలు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

జైశ్రీరామ్‌ అంటూ నినాదాలు చేస్తున్న ముస్లింలు

పెదబోదిగల్లంలో సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్న దృశ్యం

నక్కపల్లి: మతసామరస్యానికి ప్రతీకగా పెదబోదిగల్లం నిలుస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా గ్రామంలో సీతారామ కల్యాణోత్సవంలో హిందువులతో పాటు ముస్లింలు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. 80శాతం మంది ముస్లింలు నివసించే ఈగ్రామంలో రామమందిర నిర్మాణానికి వారు కూడా విరాళాలిచ్చారు. అంతేకాకుండా శ్రీరామనవమి వేడుకలను కూడా ప్రతిఏటా ఘనంగా నిర్వహించేందుకు సహకరించడంతోపాటు సీతారాముల కల్యాణ మహోత్సవంలో పాల్గొంటున్నారు.శుక్రవారం కల్యాణోత్సవంలో హిందూ, ముస్లింలు భారీ ఎత్తున పాల్గొనడంతో రామాలయం కిటకిటలాడింది. ఈ గ్రామంలో రంజాన్‌ ఉపవాస దీక్షలను హిందువులు కూడా చేస్తారు.

హలీంను హిందువులు తృప్తిగా ఆరగిస్తే.. వడపప్పు, బెల్లంపానకాన్ని రుచి చూడటానికి ముస్లింలు ఆరాటపడతారు.ప్రతిహిందువుల పండగలోను ముస్లింలు పాల్గొంటారు. ఇక్కడ శ్రీరామనవమివేడుకలేకాదు, దేవీనవరాత్రులను కూడా ఘనంగా నిర్వహిస్తారు. హిందువులు ఉరుసుల్లో మొక్కుబడులు చెల్లించుకుంటే, ముస్లింలు తూర్పుగోదావరి జిల్లాలో తలుపులమ్మతల్లిని దర్శించుకుని ముడుపులు సమర్పిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement