మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

Mar 15 2026 1:16 AM | Updated on Mar 15 2026 1:16 AM

తుమ్మపాల: మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అన్నారు. అనకాపల్లి మండలం కోడూరు ఏపీఐఐసీ సెజ్‌లో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఎలిప్‌ మహిళా శక్తి భవన్‌, శిక్షణకార్యాలయ నిర్మాణాలకు శనివారం ఆమెతో పాటు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇక్కడ సుమారు 31.77 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో మహిళా పారిశ్రామిక పార్కు నిర్మిస్తున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది నాటికి రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పమని, అందుకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. మహిళలు తమలో ఉన్న ఆలోచనలను వ్యాపార రూపంలోకి మార్చుకోవాలని, అందుకు ప్రభుత్వం, ఎలీప్‌ వంటి సంస్థలు పూర్తి సహకారం అందిస్తాయన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దడంలో ఎలీప్‌ సంస్థ అందిస్తున్న శిక్షణ ఎంతో కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌ సత్యనారాయణ, గవర కార్పొరేషన్‌ చైర్మన్‌ మళ్లా సురేంద్ర, ఎలీప్‌ సంస్థ ప్రెసిడెంట్‌ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

విజయవంతంగా అక్షర ఆంధ్ర పరీక్ష

తుమ్మపాల: ఉల్లాస్‌ అక్షర ఆంధ్ర కార్యక్రమంలో తరగతులు పూర్తి చేసుకున్న అభ్యాసకులకు ఈ నెల 15న నిర్వహించనున్న ఫౌండేషన్‌ లిటరసీ న్యూమరసీ ఎసెస్మెంట్‌ పరీక్ష (ఎఫ్‌ఎల్‌ఎన్‌ఏటీ)ను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం అక్షరాంధ్ర కార్యక్రమంపై జిల్లా, మండల స్థాయి అధికారులతో ఆమె వెబెఎక్స్‌ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎఫ్‌ఎల్‌ఎన్‌ఏటీ పరీక్షను జిల్లా వ్యాప్తంగా 2,478 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్టు చెప్పారు. 2,478 మంది ఇన్విజిలేటర్లను ఎంపిక చేసినట్టు ఆమె తెలిపారు. పరీక్షకు మొత్తం 93,292 మంది అభ్యాసకులు హాజరు కానున్నారని చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆమె ఆదేశించారు. ఈ వెబెక్స్‌లో వయోజన విద్యాశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డి.చిన్నికృష్ణ, డ్వామా పీడీ పూర్ణిమ దేవి, డీఆర్‌డీఏ పీడీ శచిదేవి, జీఎస్‌డబ్ల్యూఎస్‌ జిల్లా అధికారి మంజులవాణి, మోప్మా పీడీ పద్మావతి, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement